Maganti Gopinadh : మాగంటి గోపీనాధ్ మరణం తర్వాత ఎందుకిలా జరుగుతోంది?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మాగంటి గోపీనాధ్ మృతి పై తలెత్తుతున్న ఆరోపణలు సంచలనంగా మారాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మాగంటి గోపీనాధ్ మృతి పై తలెత్తుతున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. స్వయంగా మాగంటి గోపీనాధ్ తల్లి మహానందకుమారి చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రభావం ఎన్నికలపై చూపే అవకాశముంటుందని తెలిపారు. మాగంటి గోపీనాధ్ తన భార్యకు విడాకులు ఇవ్వకుండా మాగంటి సునీతను వివాహం చేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఆయనను ఆసుపత్రిలో మరణించినప్పటికీ బయటకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారో చెప్పాలని మహానందకుమారి ప్రశ్నించారు. చివరకు తన కుమారుడిని చివరి చూపు చూసేందుకు కూడా తనను ఎందుకు అనుమతించలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.
సమగ్ర విచారణ చేయాలంటూ...
మరొకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాగంటి గోపీనాధ్ మృతిపై సమగ్ర విచారణ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిని ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు. మాగంటి గోపీనాధ్ మృతిపై ఉన్న మిస్టరీని బాహ్య ప్రపంచానికి తెలియజెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సమాధానం ఇచ్చారు. మరణంపై ఫిర్యాదు ఎవరైనా చేస్తే విచారణ చేస్తామని తెలిపారు. ఏతల్లీ కుమారుడు మరణంపై వివాదం చేయరని అన్నారు. తల్లి చేసిన వ్యాఖ్యలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేస్తారని తెలిపారు. ఆ వివాదంలోకి తనను లాగ వద్దని తెలిపారు. మాగంటి గోపీనాధ్ మృతి విచారకరమని, అయితే దీనిపై వివాదాలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
వారసత్వంపై కూడా...
మరొకవైపు మాగంటి గోపీనాధ్ వారసత్వంపై కూడా వివాదం బయలుదేరింది. మాగంటి సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడంపై గోపీనాధ్ భార్య మాలినీ దేవి, కుమారుడు ప్రద్యుమ్న తారక్ తో పాటు గోపీనాధ్ తల్లి మహానందకుమారి కూడా ఫిర్యాదు చేశారు. తాను దగ్గరుండి మాలినీదేవికి, గోపీనాధ్ కు వివాహం చేశానని, అయితే తాను సునీతతో వివాహం చేయలేదని తెలిపారు. ఈ వివాదంపై శేరిలింగంపల్లి తాహసిల్దార్ కార్యాలయానికి చేరింది. వారసత్వం, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం చుట్టూ నడుస్తున్న వివాదంపై అధికారులు కూడా స్పందించారు. కుటుంబ సభ్యులను విచారించిన అనంతరం తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. మొత్తం మీద మాగంటి గోపీనాధ్ కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.