క్షమాపణ చెప్పు.. లేకుంటే కోర్టుకు లాగుతా : కేటీఆర్
ఫోన్ టాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన తన అడ్డగోలు, చిల్లర వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఫోన్ టాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన తన అడ్డగోలు, చిల్లర వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు లీగల్ నోటీసు పంపనున్నట్లు కేటీఆర్ తెలిపారు. బండి సంజయ్ 48 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి.. లేకుంటే బండి సంజయ్‌ను కోర్టుకు లాగుతామని కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. బండి సంజయ్ చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉందని నిరూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్‌కి నిఘా వ్యవస్థ ఎలా పని చేస్తుందో అనే అంశంలో కనీస అవగాహన లేదన్నారు. నిఘా వ్యవస్థల నిర్వాహణపైన కనీస పరిజ్ఞానం కూడా లేదన్నారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ అబద్దాలు, అనుచిత వ్యాఖ్యలు, ప్రకటనలు అన్ని హద్దులు దాటాయన్నారు. ఇంత దిగజారుడు ఆరోపణలు, చిల్లర మాటలు, బజారు మాటలు మాట్లాడడం బండి సంజయ్ కి అలవాటుగా మారిందన్నారు. ఆయన ఫోన్ టాపింగ్ వ్యవహారంలో మాట్లాడిన ప్రతిసారి మరింత దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాధ్యత కలిగిన కేంద్ర మంత్రిగా పనిచేయడం అంటే ఢిల్లీ బాసుల చెప్పులు మూసినంత ఈజీ కాదని బండి సంజయ్ కి ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదన్నారు. కేవలం తనకు రాజకీయ ప్రాధాన్యత దక్కకపోవడంతోనే.. కేవలం వార్తల్లో నిలవాలని తనకు అలవాటైన చౌకబారు వీధి నాటకాలకు తెరలేపిండన్నారు.
బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, సంతోష్ మినహా బీఆర్ఎస్ నేతల ఫోన్లన్నీ ట్యాప్ అయ్యాయన్నారు. సొంత కూతురు ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులు కేసీఆర్.. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధితుడే కదా.. రేవంత్ రెడ్డి ఎందుకు సిట్ విచారణకు హాజరు కావడం లేదు.? అంటూ ప్రశ్నించారు. 6 వేల 500 మంది ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపించారు. నాతోపాటు రేవంత్ రెడ్డి, హరీష్ రావుసహా ఆనాటి మంత్రుల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పోన్లను కూడా ట్యాప్ చేశారు.. నా ఫోన్ ను ప్రతి క్షణం ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు.