komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి పార్టీ మారుతున్నారా? అందులో నిజమెంత?
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ లోని ఒక వర్గం నేతలు ప్రచారాన్ని మొదలు పెట్టారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ లోని ఒక వర్గం నేతలు ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఆయన పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఆయనకు గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చింది. అయితే సామాజికవర్గ సమీకరణాలు, నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులుండటంతో పాటు కోమటిరెడ్డి కుటుంబంలో ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండటం కూడా ఆయన మంత్రి పదవి రావడానికి ఇబ్బందిగా మారింది.
గత కొంతకాలంగా...
కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు కుటుంబం, కులం, జిల్లాతో ముడిపెట్టి మంత్రి పదవిని కొందరు కావాలని ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గత కొంత కాలం నుంచి ప్రభుత్వం పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డంపడుతుంది సీనియర్ నేత జానారెడ్డి అంటూ ఆయన మండిపడ్డారు కూడా. తనకు హోం మంత్రి పదవి కావాలని ఆఫ్ ది రికార్డులో చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత అసలు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ లోని ఆయన ప్రత్యర్థి వర్గమే ఈ ప్రచారం చేస్తుందని ఆయనే చెబుతున్నారు.
కోమటిరెడ్డి ఏమన్నారంటే?
తాను పార్టీ మారే ప్రసక్తి లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కావాలని కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానిని మీడియా ముందు బహిరంగంగానే చెబుతానని, చాటుగా రాజకీయాలు చేసే అలవాటు తనకు లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని, తాను సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పుకొచ్చారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తాను పనిచేస్తానని, తన ముందు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు.