Komatireddy : హలో.. వినిపించడం లేదా.. కోమటిరెడ్డి కామెంట్స్ కనిపించడం లేదా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూకుడు ఆగేటట్లు కనిపించడం లేదు

Update: 2025-09-17 12:14 GMT

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూకుడు ఆగేటట్లు కనిపించడం లేదు. ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తన్నప్పటికీ పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదు. చూసీ చూడనట్లు, వినీ విననట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తుండటంతో ఆయన మరింతగా పార్టీకి తలనొప్పిగా తయారయ్యారన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం లేదని తెలిసినప్పటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని డ్యామేజీ చేస్తూ పలు రకమైన వ్యాఖ్యలు చేశారు. అయినా సరే పార్టీ క్రమశిక్షణ సంఘం కానీ, పీసీసీ కాని ఏమీ వినపడనట్లు మాత్రమే వ్యవహరిస్తుంది.

క్రమశిక్షణ సంఘం... పీసీసీ...
చిన్నా చితకా నేతలతో పాటు కొందరి ముఖ్యమైన నేతలకు నోటీసులు ఇచ్చే క్రమశిక్షణ సంఘం తమకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది. పత్రికల్లో పతాక శీర్షికల్లోనూ, సోషల్ మీడియాలోనూ అవి కనిపిస్తున్నప్పటికీ తమకు తెలియదని క్రమశిక్షణ సంఘం బుకాయిస్తుందని పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక మరొకవైపు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా తమకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, క్రమశిక్షణ సంఘం దృష్టికి వస్తే దానిని పరిశీలించవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో ఎవరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీపైన, ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి పైన వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యలను మాత్రం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది.
తాజా వ్యాఖ్యలతో...
తాజాగా కోమటిరెడ్డి మరోసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన మాట్లడుతూ నిరుద్యోగ యువత ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేయడం సహేతుకమైనదేనని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మ్యానిఫేస్టో లో చెప్పిన దానిని అనుసరించి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. అంతేకాదు..గ్రూప్ 1 అవకతవకలపై ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానిని కూడా అన్నారు. దీంతో టీజీపీఎస్సీసీ అవకతవకలు జరగలేదని చెబుతుంటే, ప్రభుత్వంలోని పెద్దలు కూడా పరీక్షలు సజావుగాజరిగాయని చెబుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మరోసారి కాక పుట్టిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఈసారి కూడా ఉండకపోవచ్చు.







Tags:    

Similar News