Khammam : ఖమ్మం జిల్లా నేతలు.. కేబినెట్‌లో ఎక్కువగా.. రీజన్ ఇదే

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా నిలుస్తుంది. ఈ ఎన్నికల్లోనూ ఖమ్మం నుంచి అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు

Update: 2023-12-07 06:02 GMT

ఖమ్మం జిల్లా ఎప్పుడూ కాంగ్రెస్ కు కంచుకోటగా నిలుస్తుంది. 2014, 2018 ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక శాతం మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కాలుమోపకుండా చేయడానికి అక్కడి ప్రజలు కారణమవుతూ వస్తున్నారు. ఒక్క పార్లమెంటు స్థానం మినహాయించి మెజారిటీ స్థానాలను ఎప్పుడూ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పరమవుతుంటాయి. ఆంధ్ర సరిహద్దు జిల్లాగా కావడంతో కాంగ్రెస్ కు కొంత అదనపు బలమయింది.

ముగ్గురు మంత్రులుగా...
ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒక జిల్లాలో ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం అంటే మామలూ విషయం కాదు. మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు కూడా మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఖమ్మం జిల్లా నుంచి ఒకే కేబినెట్ లో ఇంత మంది మంత్రులు లేకపోవడం గమనార్హం. దీంతో అన్ని జిల్లాలకంటే కాంగ్రెస్ ఖమ్మం జిల్లాకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తొలి నుంచి అంచనాలు వినపడుతున్నాయి.
చేరికలు కూడా...
ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని సీపీఐ ఒక స్థానంలో గెలిచింది. ముఖ్యంగా కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ఖమ్మం, నల్లగొండ జిల్లాలనే చెప్పుకోవాలి. అందుకే అంత ప్రయారిటీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు పార్టీలో చేరడం కూడా కాంగ్రెస్ కు రాష్ట్ర వ్యాప్తంగా కలసి వచ్చింది. అందుకే ఖమ్మం జిల్లాకు అంత ప్రయారిటీ లభించింది.


Tags:    

Similar News