Telangana : ముగ్గురి వద్దనే వెయ్యి కోట్లా... వీళ్లు దొరికినోళ్లు... దొరకనోళ్లు ఇంకెంత మందో?

కాళేశ్వరం ప్రాజెక్టు కొందరు నీటిపారుదల శాఖ అధికారులకు వరంగా మారింది

Update: 2025-07-17 04:44 GMT

కాళేశ్వరం ప్రాజెక్టు కొందరు నీటిపారుదల శాఖ అధికారులకు వరంగా మారింది. కోట్ల రూపాయల నిధులను కూడబెట్టారనడానికి ఏసీబీ గత కొంతకాలంగా జరుపుతున్నదాడులతో స్పష్టమవుతుంది.ఇప్పటి వరకూ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులందరూ కోట్లు కూడబెట్టుకున్నారు. దీన్ని బట్టిచూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులకు కాసుల వర్షం కురిపించిందని ఏసీబీ దాడుల ద్వారా అర్థమవుతుంది. ఇప్పటి వరకూ ముగ్గురు నీటి పారుదల శాఖ అధికారులపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ముగ్గురి నుంచి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కనుగొన్నారంటే ఏ రేంజ్ లో అవినీతికి పాల్పడ్డారో అర్థమవుతుంది. ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, విల్లాలు, ఖరీదైన కార్లు, బంగారం, వెండి ఆభరణాలు చూసి ఏసీబీ అధికారులే అవాక్కవుతున్నారు. ఈ రేంజ్ లో సంపాదించారంటే కాళేశ్వరం ఎంత వరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

మురళీధరావు ఆస్తులు చూస్తే...
నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్సీ మురళీధరావు ఇంట్లో జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల అక్రమార్జన బయటపడిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆయన ఆస్తుల విలువ ఆరువందల వందల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో విలువైన భూములు, ఇంటి స్థలాలలతో పాటు పవర్ ప్రాజెక్టు, ఖరీదైన ఫ్లాట్లు, ఇంటి స్థలాలు, విల్లాతో పాటు బంగారం, వెండి ఆభరణాలను ఉన్నట్లు కనుగొన్నారు. ఇక బ్యాంకు లాకర్లను కూడా తెరవాల్సి ఉంది. అది తెరిస్తే ఇంకా ఎన్ని ఆస్తులు బయటపడతాయోనంటున్నారు. హైదరాబాద్ లోని మోకిలాలో 6,500 చదరపు గజం స్థలం ఉంది. అలాగే హైదరాబాద్ శివార్లలో పదకొండు ఎకరాల సాగు భూమి కూడా ఉంది. జహీరాబాద్ లో టూ కేవీ సోలార్ పవర్ ప్రాజెక్టు, బంజారాహిల్స్, యూసఫ్ గూడ, కోకపేట, బేగంపేట్లో నాలుగు ఫ్లాట్లు, నాలుగు ఇళ్లస్థలాలను ఉన్నట్లు సోదాల్లో ఏసీబీ అధికారులు కనుగొన్నారు.వరంగల్, కోదాడా ప్రాంతంలోనూ అపార్ట్ మెంట్లతో పాటు కొండాపూర్ లోని ఖరీదైన విల్లా ఉంది. అయితే లాకర్ ఓపెన్ చేస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశముందని భావిస్తున్నారు.
నూనె శ్రీధర్ ఆస్తులు రెండు వందల కోట్లు...
ఇక కొన్నాళ్ల క్రితం మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్‌ అక్రమార్జనను కూడా ఏసీబీ అధికారులు వెలికి తీశారు కాళేశ్వరం మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా ఉన్ననూనె శ్రీధర్‌ భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు సోదాల్లో కనుగొన్నారు. అమీర్ పేట్ లో కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు ఇక తెల్లాపూర్ లో విల్లాతో పాటు కరీంనగర్ లో మూడు ఇళ్లు, షేక్ పేట్ లో ఒక ఫ్లాట్, ఇంకా వ్యవసాయ భూములున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇవి కాకుండా కరీనంగర్, హైదరాబాద్, వరంగల్ లలో పందొమ్మిది ఓపెన్ ప్లాట్లు ఉన్నాయని ఏసీబీ దర్యాప్తులో వెల్లడయింది. దీంతో పాటు పదహారు ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. ఇక కార్లు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కూడా ఉన్నాయి. వీటి మొత్తం ఆస్తుల విలువ రెండు వందల కోట్లకుపైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత మరిన్ని ఆస్తులు బయటపడ్డాయి.
హరిరామ్ ఆస్తులివీ...
కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హారిరామ్ ఇంటిపై ఏసీబీ సోదాలు కొంతకాలం క్రితం జరిగాయి. హరిరాం ఇళ్లు, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. . ఈ ఆస్తుల విలువ రెండు వందల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. హరిరామ్ భార్య కూడా ఇంజనీరింగ్ అధికారిగా పనిచేస్తుండటంతో ఆమె ఇళ్లలోనూ తనిఖీలను నిర్వహించారు. హరిరామ్ కు శామీర్ పేట్ లో ఒక విల్లాతో పాటు, కొండాపూర్ లో విల్లా, శ్రీనగర్ కాలనీ లో ఒక ఫ్లాట్ తో పాటు మాదాపూర్ లోనూ మరొక ప్లాట్ ఉందని తేల్చారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనూ కమర్షియల్ స్సేస్ ను హరిరామ్ కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. మర్కూక్ మండలంలో ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమితో పాటు, పటాన్ చెర్వులో ఇరవై కుంటల భూమి, హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్లు ఇళ్లు, బొమ్మల రామారంలో ఒక ఫామ్ హౌస్, కుత్బుల్లా పూర్ లో ఓపెన్ ఫ్లాట్, మిర్యాలగూడలో ఒక ఫ్లాట్, మామిడితోట, రెండు బీఎండబ్ల్యూ కార్లు, బంగారు ఆభరణాలు, నగదు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇలా ముగ్గురి ఆస్తుల విలువే మార్కెట్ విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉండటంతో కాళేశ్వరం కాసులు కురిపించిందని చెప్పకనే చెప్పొచ్చు.


Tags:    

Similar News