Kaleswaram Project :కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో ఏముంది? ఇక యాక్షన్ లోకి సర్కార్ దిగనుందా?
కాళేశ్వరం కమిషన్ నివేదిక గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారుల తీరును తప్పుపట్టినట్లు తెలిసింది
కాళేశ్వరం కమిషన్ నివేదిక గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారుల తీరును తప్పుపట్టినట్లు తెలిసింది. ఈరోజు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మూడు బ్యారేజీల నిర్మాణలకు ఎలాంటి అనుమతులు లేవని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. సరైన ప్లానింగ్ లేదని, డిజైన్ లో కూడా లోపాలు ఉన్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ నిర్మాణంలో పూర్తిగా కేసీఆర్ దే బాధ్యత అని కమిషన్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. వాప్కోస్ నివేదికను కూడా గత ప్రభుత్వం తొక్కి పెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టిందని కమిషన్ అభిప్రాయపడినట్లు చెప్పింది.
అనేక తప్పిదాలు...
బీఆర్ఎస్ నేతలతో పాటు అధికారుల తప్పిదాలను కూడా కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో ఎత్తి చూపింది. టర్న్ కీ పద్ధతిలో బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని సెంట్రల్ వాటర్ వర్క్స్ కమిషన్ సూచించినా దానిని పట్టించుకోకపోవడంపై కమిషన్ అభ్యంతరం తెలియజేసింది. తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదంటూ నాటి బీఆర్ఎస్ నేతలు సమర్ధించుకునే ప్రయత్నం చేసిందని కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. వానకాలం ముందు కానీ, తర్వాత కానీ బ్యారేజీ ప్రాజెక్టులకు నిర్వహణ పనులు సక్రమంగా నిర్వహించలేదని పేర్కొన్నట్లు కమిషన్ తెలిపినట్లు తెలిసింది. మూడు బ్యారేజీల్లో సమస్యలు వచ్చాయని చెప్పింది. కొత్త రాష్ట్రం ఆర్థిక స్థితిగతులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని కూడా కమిషన్ అభిప్రాయపడింది.
పదహారు మందిని తప్పుపడుతూ...
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు, నిర్మాణంలో జరిగిన లోపాలకు పూర్తి బాధ్యత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అభిప్రాయపడింది.కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినడానికి మొత్తం పదహారు మంది కారణమని కమిషన్ నివేదికలో చెప్పినట్లు తెలిసింది. నిపుణుల కమిటీ నివేదికను నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పట్టించుకోలేదని కూడా తెలిపింది. బ్యారేజీ లోకి నీరు నింపడమే అవి దెబ్బతినడానికి కారణమని కమిషన్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. ఇందుకు కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ అని పేర్కొన్నారు. మరొకవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం కేవలం రాజకీయకక్ష కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శిస్తున్నారంటుంది. ఏదైనా తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో నివేదికపై చర్చించి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.