Jubilee Hills Bye Elections : పోలింగ్ దారుణం.. ఇది ఎవరికి లాభమంటే?

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదయింది.

Update: 2025-11-11 13:10 GMT

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదయింది. సాయంత్రం ఐదు గంటలకు 47 శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. అయితే పోలింగ్ శాతం తక్కువగా నమోదవ్వడం ఎవరికి లాభమన్న చర్చ రాజకీయ పార్టీల్లో జరుగుతుంది. తక్కువ పోలింగ్ శాతం నమోదయితే అది అధికారంలో ఉన్న పార్టీకి ప్రయోజనమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే పెద్దయెత్తున పోలింగ్ శాతం నమోదయ్యేదని చెబుతున్నారు. బీఆర్ఎస్ కూడా పోలింగ్ శాతం ఎక్కువ కావడానికి చివరి నిమిషం వరకూ ప్రయత్నించింది. ప్రధానంగా బస్తీల్లో ఓటర్లను ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు రప్పించాలని చూసింది. కానీ పోలింగ్ శాతం పెరగకపోవడంతోబీఆర్ఎస్ కూడా కొంత నిస్తేజంలో పడినట్లు కనిపిస్తుంది.

కాంగ్రెస్ కూడా అత్యధికంగా...
మరొకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అత్యధిక సంఖ్యలో ఓట్లు నమోదు చేయించాలని భావించింది. చిత్ర పరిశ్రమకు చెందిన కార్మికులతో పాటు బస్తీ వాసులను పెద్దయ సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి తీసుకు వచ్చి తమకు అనుకూలంగా ఫలితాన్ని మలచుకోవాలని భావించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఉదయం మీడియాతో మాట్లాడుతూ అరవై శాతం పోలింగ్ జరుగుతుందని చెప్పడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా అధిక శాతం పోలింగ్ పైనే ఆశలు పెట్టుకున్నట్లు అర్థమవుతుంది. కానీ తీరా చూస్తే తక్కువ శాతం పోలింగ్ నమోదవ్వడంతో కాంగ్రెస్ నేతల్లో కూడా ఒకరకమైన చర్చ మొదలవుతుంది. వివిధ సామాజికవర్గాలతోనూ, చిత్ర పరిశ్రమ కార్మికులతోనూ ముఖ్యమంత్రి సమావేశమవ్వడంతో పోలింగ్ శాతం పెరుగుతుందని కాంగ్రెస్ కూడా భావించింది.
బీజేపీ మాత్రం...
ఇక బీజేపీ ఈ విషయంలో పెద్దగా ఆశలు లేకుండా బరిలోకి దిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సయితం జూబ్లీహిల్స్ ఉప నియోజకవర్గం ఉప ఎన్నిక ఒక చిన్న ఎన్నిక అని కొట్టిపారేయడం కూడా పార్టీలో చర్చకు దారి తీసింది. బీజేపీ తాము గెలవకపోయినా మరొకరి గెలుపోటములపై కీలకంగా మారనుందని తొలి నుంచి అంచనాలు వినిపించిన నేపథ్యంలో తక్కు పోలింగ్ శాతం నమోదు కావడంతో మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారు తమకు అనుకూలంగా ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. వివిధ సర్వేలు ఒక పార్టీకి అనుకూలంగా వస్తుందని చెప్పడంతో పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నారని రాజకీయ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కానీ ఓటర్ల మనసులో ఏముందన్నది ఈ నెల 14వ తేదీ కౌంటింగ్ తర్వాత తెలియనుంది.


Tags:    

Similar News