Jubilee Hills Bye Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ ధీమా అదేనట
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఇదే సమయంలో నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా అక్కడ కాంగ్రెస్ ను గెలిపించాలన్న నినాదంతో కాంగ్రెస్ ముందుకు వెళుతుంది. ప్రజలు కూడా అనేక రకాలుగా ఆలోచిస్తారు. అధికారంలో ఉన్న పార్టీకి ఖచ్చితంగా ఎంతో కొంత అడ్వాంటేజీ ఉంటుంది. సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. మూడేళ్లు అంటే సుదీర్ఘ సమయం. మూడేళ్ల పాటు ప్రతిపక్ష పార్టీని గెలిపించినా తమకు ఉపయోగం లేదన్న భావన ప్రజల్లో సహజంగానే ఉంటుందని కాంగ్రెస్ నేతలు కూడా గట్టిగా నమ్ముతున్నారు. మూడేళ్లలో రావాల్సిన సంక్షేమ పథకాలు, జరగాల్సిన అభివృద్ధి వంటి వాటిపైనే ప్రజలు దృష్టి పెడతారని అంచనా వేస్తున్నారు.
సెంటిమెంట్ కంటే...
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మరణంతో అనివార్యమయింది. సానుభూతి ఓట్ల కోసం బీఆర్ఎస్ మాగంటి గోపీనాధ్ భర్త మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చింది. అయితే సెంటిమెంట్ తో తాము గెలుస్తామని భావిస్తుంది. కానీ గతంలో జరిగిన ఎన్నికలు చూస్తే ప్రజలు సెంటిమెంట్ కు పట్టం కట్టలేదని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో సిట్టింగ్ శాసనసభ్యులు మరణంతో ఉప ఎన్నికలు జరిగిన పాలేరు, దుబ్బాక, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లోనూ అక్కడ సెంటిమెంట్ పనిచేయలేదన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రజలు ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ కంటే డెవలెప్ మెంట్ కే అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్నారు.
పోలింగ్ శాతంపైనే...
కాంగ్రెస్ ధైర్యం అదే. దీంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బస్తీల్లో తిరుగుతున్నారు. కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కులాలు, మతాల వారీగా కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేస్తుంంది. ముఖ్యంగా మైనారిటీ వర్గాలను ఆకట్టుకునేందుకు మహ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ముఖ్యమంత్రి కులాల వారీగా సమావేశమవుతూ వారికి భరోసా కల్పిస్తున్నారు. మంత్రులు కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. బస్తీ ఓట్లు ఎక్కువగా పోలయ్యేలా మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతలను తీసుకుని మరీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక కాంగ్రెస్ కు మరింత ఊపునిస్తుందా? షాకిస్తుందా? అన్నది చూడాలి.