Jeevan Reddy : జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
సీనియర్ నేత జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం సిద్ధమయింది
సీనియర్ నేత జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం సిద్ధమయింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి త్వరలోనే గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన ప్రాతినిధ్యం లభించకపోవడం, అనేక అవమానాలు జరగడంతో ఆయన నాయకత్వ తీరును తప్పుపడుతూ పార్టీ నుంచి వైదొలిగారు. అయితే జీవన్ రెడ్డి ఈ నెల 10వ తేదీన జగిత్యాలలోనే బీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతుంది. పదో తేదీన జగిత్యాలకు సమీపంలోని లక్ష్మిపూర్ లో ఏప్రిల్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారని వినికిడి.
కేసీఆర్ హాజరై...
అయితే ఈ సభకు గులాబీ బాస్ కేసీఆర్ సభకు హాజరవుతారని చెబుతున్నారు. అందరిలాగా బీఆర్ఎస్ కార్యాలయంలో కాకుండా తన నియోజకవర్గంలోనే పార్టీ మారేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. కేసీఆర్ కూడా హాజరై స్వయంగా కండువా కప్పితే తమకు ప్రాధాన్యత లభించినట్లవుతుందని భావిస్తున్నారు. కరీంనగర్ ప్రాంతంలో ఎప్పటి నుంచో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతుంది. జీవన్ రెడ్డి చేరికతో పార్టీ బలం జిల్లాలో పెరుగుతుందని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది.
జగిత్యాల ప్రాంతంలోనే...
జీవన్ రెడ్డి కూడా అందరిలాగా ఫామ్ హౌస్ కు వెళ్లో.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకోకుండా తన వద్దకే రప్పించాలని భావిస్తున్నారు. కేసీఆర్ స్వయంగా తన గురించి మాట్లాడితే ఇంకా తన క్రేజ్ జగిత్యాలలోనే కాకుండా జిల్లాలోనూ తనకంటూ ప్రత్యేకంగా గౌరవం మరింత లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పైన విమర్శలు చేయడానికి కూడా వేదిక దొరుకుతుందని అంచనా వేసిబీఆర్ఎస్ కూడా అందుకు అంగీకరించిందని తెలిసింది. బహిరంగ సభ వేదిక స్థలాన్ని త్వరలోనే కేటీఆర్, హరీశ్ రావు కూడా చూస్తారని, వారు ఖరారు చేసిన తర్వాత తేదీ ఖరారవుతుందని అంటున్నారు. మొత్తం మీద జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఖాయమైంది. ఇక ఆయనకు పార్టీలో ఏ మేరకు ప్రాధాన్యత లభిస్తుందన్నది కాలమే సమాధానం చెబుతుంది.