Jana Reddy : పెద్దాయన ఫిక్స్ అయినట్లేనా? పక్కన పెట్టేసినట్లుందిగా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జానారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు

Update: 2025-12-12 13:09 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జానారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో జానారెడ్డి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన ఊసే మరిచిపోయినట్లు అనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో వారసులను రంగంలోకి దింపి తాను రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్న జానారెడ్డికి పెద్ద పదవి లభిస్తుందని భావించారు. తనకు రాజ్యసభకు పంపుతారని జానారెడ్డి బలంగా భావించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఆయనకు పదవి దక్కకపోవడంతో, కుమారులు రాజకీయంగా ఎదిగి రావడంతో ఇక జానారెడ్డి రాజకీయాలకు తనకు తానే ఫుల్ స్టాప్ పెట్టుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

ఏడాది క్రితంర వరకూ...
ఏడాది క్రితం వరకూ అప్పుడప్పుడు పార్టీ సమావేశాలకు గాంధీభవన్ కు హాజరయ్యే జానారెడ్డి ఇటీవల కాలంలో అది కూడా లేదు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత జానారెడ్డి తాను ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన బోనని ప్రకటించారు. జానారెడ్డి వయసు 75 సంవత్సరాలు దాటడంతో ఇక రాజకీయంగా విశ్రాంతి తీసుకోవడమే మంచిదని ఆయన భావిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయినప్పటికీ తనకు పార్టీ పదవులను అందించిన కాంగ్రెస్ పార్టీకి సేవలందించడానికి మాత్రం అప్పుడప్పుడు పనిచేస్తానని జానారెడ్డి గతంలో చెప్పారు.నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు.
ఏడు పదుల వయసు దాటినా...
జానారెడ్డి తాను రాజకీయంగా దూరమైనా, తన కుమారుడు రఘువీర్ రెడ్డిని పోటీకి దింపారు. అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయినా తనను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గౌరవిస్తుందని ఆశించారు. రాజ్యసభ పదవి దక్కుతుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ కనుచూపు మేరలో అది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే రాజ్యసభ పదవులు ఖాళీ అయినా అనేక మంది ఆశావహులు పోటీలో ఉన్నారు. వారందరినీ కాదని, రెడ్డి సామాజికవర్గం నేత అయిన తనకు ఇచ్చే అవకాశం లేదని జానారెడ్డి ఫిక్స్ అయినట్లు కనపడుతుంది. ఏడు పదుల వయసు దాటినా హుషారుగా ఉండే జానారెడ్డిని కొందరు నేతలు అప్పుడప్పుడు వెళ్లి కలసి వస్తున్నారు. ఇటీవల కలిసిన నేతలతో ఇక రాజకీయంగా తనను ఎవరూ పట్టించుకోరని ఆయన ఆవేదన చెందినట్లు తెలిసింది.



Tags:    

Similar News