Jagga Reddy : జగ్గారెడ్డి నిర్ణయం అందుకేనా.. పదేళ్లు గ్యాప్ తీసుకుంది ఎందుకో తెలిస్తే?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించి సంచలనానికి తెరతీశారు

Update: 2025-10-04 13:05 GMT

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించి సంచలనానికి తెరతీశారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం అని ప్రకటిస్తున్న సమయంలో జగ్గారెడ్డి తాత్కాలిక రాజకీయ బ్రేక్ ఎందుకన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కదని జగ్గారెడ్డి భావిస్తున్నారా? లేక తాను పోటీ చేస్తే సంగారెడ్డి నుంచి గెలిచే అవకాశం ఉండదని ఆయనకు ఏమైనా నివేదికలు అందాయా? అన్న విషయాలు బయటకు చెప్పకపోయినా తాను పదేళ్ల పాటు పోటీకి దూరంగా ఉంటానని జగ్గారెడ్డి చెప్పడం నియోజకవర్గంలోనే కాకుండా పార్టీలో కూడా హాట్ టాపిక్ గా మారింది.

మూడు సార్లు గెలిచి...
తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి గెలిచారు. తొలిసారి 2004లో నాటి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జగ్గారెడ్డి ఆ ఎన్నికల్లో గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారు. పార్టీ మారినప్పటికీ 2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జగ్గారెడ్డి విజయం సాధించారు. అయితే తర్వాత 2014 ఎన్నికల్లో మాత్రం రాష్ట్ర విభజన జరిగిన వెంటనే జరిగిన ఎన్నికల్లో సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి విజయం సాధించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో మాత్రం జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పోటీ చేసి ఓటమి పాలు కావడంతో ఆయనకు ఏ పదవి దక్కలేదు.
కార్యకర్తలతో దగ్గరగానే...
అందుకే ఈసారి జగ్గారెడ్డి మనసు మార్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తన సతీమణి నిర్మల బరిలో ఉంటారని చెప్పారు. పదేళ్ల పాటు తాను పోటీకి దూరంగా ఉంటానని ఆయన కార్యకర్తలకే తెలిపారు. ఒకవేళ తాను పోటీ చేసి మరోసారి ఓటమి పాలయితే ఏ పదవి లేకుండా ఉండాల్సి వస్తుందనా? లేక కొత్త వారికి అవకాశం ఇచ్చినట్లవుతుందనా? అన్నది మాత్రం అర్థం కాకుండా ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవచ్చన్న అంచనాకు ఆయన వచ్చారా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే పదేళ్లు గ్యాప్ తీసుకుని తిరిగి పోటీ చేస్తామనడం ఏరకమైన వ్యూహమన్నది క్యాడర్ కు కూడా అర్థం కాకుండా ఉంది. అయితే తన సతీమణి పోటీలో ఉంటుందని చెప్పడంతో కార్యకర్తలకు ఆయన టచ్ లోనే ఉంటూ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద జగ్గుభాయ్ నిర్ణయం వెనక మతలబు ఏమిటన్నది ఎవరికి అంతుపట్టని విధంగా ఉంది.


Tags:    

Similar News