దీదీ బాటలోనే కేసీఆర్..?

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎవరికి మద్దతు ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది

Update: 2022-07-22 06:56 GMT

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరికి మద్దతు ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఎంసీ కి రాజీనామా చేసి వచ్చిన యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ అండగా నిలిచారు. ప్రచారం నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన యశ్వంత్ సిన్హాకు విమానాశ్రయం వద్దకు వెళ్లి స్వాగతం పలికారు. అనంతరం భారీగా ర్యాలీ చేపట్టారు. యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికినా రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు...
ఇక తాజాగా ఉప రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అధికార పార్టీ అభ్యర్థిగా జగదీప్ థన్‌కర్, విపక్షాల అభ్యర్థిగా మార్గెరెట్ ఆల్వా పేరును ప్రకటించారు. అయితే మార్గరెట్ ఆల్వా కాంగ్రెస్ నేత. ఆమె కరడు గట్టిన కాంగ్రెస్ నేత అన్నది అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మార్గరెట్ ఆల్వాకు మద్దతు ప్రకటిస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. దక్షిణాదికి చెందిన ఆల్వాకు మద్దతు తెలపాలని ఉన్నా ఆమె కాంగ్రెస్ కావడంతో వెనక్కు తగ్గే అవకాశాలున్నాయి. అదే సమయంలో మమమ బెనర్జీ బాటలోనే కేసీఆర్ పయనిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే టీఎంసీ ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. కేసీఆర్ కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.


Tags:    

Similar News