తొలి విడత ఆశించినా...
అయితే తొలి విడత మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే తనకు మంత్రి పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశించారు. కానీ మరో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉంచడంతో మలి విడత మంత్రి పదవి వస్తుందని భావించారు. ఢిల్లీకి వెళ్లి తన పరిచయాలను ఉపయోగించి లాబీయింగ్ చేసుకుని మరీ వచ్చారు. తనతో పాటు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన గడ్డం వివేక్ తో పాటు తనకు కూడా మంత్రి పదవి దక్కుతుందని భావించారు. ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతూ తనకు హోం మంత్రి పదవి అంటే ఇష్టమని కూడా ఆయన వ్యాఖ్యానించారంటే మంత్రి పదవిపై ఎంత మక్కువో ఇలా చెప్పకనే అర్థమవుతుంది. అయితే అదే సమయంలో సీనియర్ నేత జానారెడ్డిపై కూడా ఆయన ఆరోపించారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతుంది జానారెడ్డి అని ఆయన కుండబద్దలు కొట్టి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మలి విడతలోనూ...
అయితే మలి విడతలోనూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. కానీ ఆయనతో పాటు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన గడ్డం వివేక్ కు మంత్రి పదవి వరించింది. ముగ్గురికి మాత్రమే అవకాశం ఇచ్చింది. దీంతో ఆయన ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. గత కొంతకాలంగా ఫ్రస్టేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేస్తున్నారు. ట్వీట్లు కూడా పెడుతున్నారు. కానీ తాజాగా రేవంత్ రెడ్డిపై విమర్శలను నేరుగా చేస్తున్నారు. బిల్లుల చెల్లింపులలో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపించారు. పదవులు మీకే..పైసలు మీకేనా...అంటూ నిష్టూరమాడారు. పదవులు తీసుకోండి.. కానీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వండి..అంటూ మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దంటూ వ్యాఖ్యానించారు. ఇంతకుముందువరకూ రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి ఈ సారి మాత్రం నేరుగా ఆయన పేరు ప్రస్తావించి మరీ విమర్శలు చేయడం అధికార పార్టీలో చర్చనీయాంశమైంది.
మంత్రి పదవి దక్కదని...
దీన్ని బట్టి చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక నేరుగా వార్ కు సిద్ధమయినట్లే కనిపిస్తుంది. కాంగ్రెస్ హైకమాండ్ తనకు మంత్రి పదవి ఇవ్వకపోవచ్చన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే ఏది ఏమైనా.. హైకమాండ్, పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ అన్నింటికీ తాను సిద్ధంగానే ఉన్నట్లు ఆయన కనపడుతున్నారు. అందుకే తెగించి మాట్లాడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలే చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా ఆ వ్యాఖ్యలను పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన మీడియాకు చెప్పారు. అయితే క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయం కాదన్నది అందరికీ తెలుసు. ఇది పార్టీ హైకమాండ్ తీసుకోవాల్సిన నిర్ణయం. అది తేలాలంటే మరోమూడేళ్లు గడిచిపోవాల్సిందే తప్ప ఎటువంటి చర్యలుండవన్న ధీమా కోమటిరెడ్డి అనుచరుల్లో కనపడుతుంది. తర్వాత రాజెవరో? ఏమో? అన్న రీతిలో ఉంది.