Telanana : నిప్పులు కురుస్తున్నాయిగా.. ఇక మరో రెండు నెలలు కష్టమేనట

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గరిష్టంగా నమోదవుతున్నాయి

Update: 2025-03-11 03:37 GMT

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గరిష్టంగా నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. భానుడి భగభగలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. ఫిబ్రవరి చివరి నాటి నుంచే ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరగడం ప్రారంభించాయి. మొన్నటి వరకూ చలిగాలులు వీస్తున్నా రెండు, మూడు రోజుల నుంచి వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. మార్చి నెల మొదటి వారంలోనే నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే ఇక రాను రాను రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపించక తప్పదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. వాతావరణ కేంద్రం నిపుణులు కూడా అదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఈ మండాలాల్లో అధికమే...
తెలంగాణలోని దాదాపు మూడు వందలకు పైగా మండలాల్లో హీట్ వేవ్స్ ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. భూమిలో తేమ శతం ఇప్పటికే తగ్గిందని, రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా మారి త్వరగా వేడెక్కుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. దీనివల్ల అనేక అనర్ధాలు చోటు చేసుకునే అవకాశముందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింతగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా అంచనా వేస్తుండటంతో రాను రాను గడ్డు కాలమేనని చెప్పక తప్పదు. రాజస్థాన్ నుంచి వచ్చే గాలులు తెలంగాణ వైపు వస్తుండటమూ కూడా ఉష్ణోగ్రతలు, వేడిగాలుల పెరగడానికి కారణమని తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే...
మరొక వైపు చెట్లను నరికి వేయడం, పట్టణాలు, నగరాలను కాంక్రీట్ జంగిల్ గా మార్చడంతో పూర్తిగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు. అందుకే ఈ ఏడాది గత ఏడాది కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు. సాధారణంగా వాతావరణ శాఖ 45 డిగ్రీలు దాటితే హీట్ వేవ్స్ గా పరిగణనలోకి తీసుకుంటారు. మార్చి మొదటి వారంలో నలభై డిగ్రీలుంటే చివరి నాటికి 45 డిగ్రీలకు సులువుగా చేరుతుందని భావిస్తున్నారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది.


Tags:    

Similar News