Telangana : పదవుల జాతరకు ముహూర్తం ఖరారు.. రెండు రోజుల్లోనే?
తెలంగాణలో ఒకట్రెండు రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన కసరత్తులను కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు
caste enumeration in telangana
తెలంగాణలో పదవుల జాతరకు ముహూర్తం ఖరారయినట్లే కనిపిస్తుంది. ఒకట్రెండు రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన కసరత్తులను కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు రోజుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేసి పార్టీ పెద్దలతో నామినేటెడ్ పదవులపై చర్చిస్తున్నారు. మంత్రులను కలసి తమకు రాష్ట్ర ప్రయోజనాలను త్వరితగతిన అందించాలని వినతిపత్రాలను సమర్పిస్తూనే మరొక వైపు నామినేటెడ్ పదవులపై కూడా ఆయన కసరత్తు చేసినట్లు తెలిసింది.
నామినేటెడ్ పోస్టులను...
దాదాపు 37 నామినేటెడ్ పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది. ఒకేసారి పదవులను భర్తీ చేసి, స్థానిక సంస్థ ల ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో కాంగ్రెస్ నాయకులున్నారు. ఈరోజు ఢిల్లీకి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బయలుదేరి వెళుతున్నారు. అందరూ కలసి నామినేటెడ్ పదవుల విషయంలో ఒక క్లారిటీకి వచ్చే అవకాశముందని తెలిసింది. అన్నీ సవ్యంగా సాగితే రెండు రోజుల్లోనే పోస్టులకు సంబంధించిన జీవోలు విడుదలవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.