KCR : సారూ... పిల్లల కంటే ఫామ్ హౌస్ లో చెట్లను పెంచుకుంటేనే బెటరనిపిస్తుందా?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రావాల్సిన కష్టం కాదు ఇది. ఒకవైపు కుమారుడు. మరొకరు కుమార్తె

Update: 2025-05-29 07:31 GMT

నిజమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రావాల్సిన కష్టం కాదు ఇది. ఒకవైపు కుమారుడు. మరొకరు కుమార్తె. ఇద్దరూ రక్తం పంచుకుపుట్టిన వారే. పేగు తెంచుకున్న వారే పీకలు కోసేందుకు సిద్ధమవ్వడం అదీ తన కళ్ల ముందే జరుగుతుండటం ఏ తండ్రికీ రాకూడని కష్టం. ఆస్తిపాస్లులంటే...అటో ఇటో పంచి ఇవ్వవచ్చు. కానీ పార్టీని పంచి పెట్టడమంటే ఆచరణలో సాధ్యం కాదు. ఇందులో తూనికలు.. కొలతలు... బరువులకు తావుండదు. ఒకే లెక్క. ప్రాంతీయ పార్టీలో ఒకరి నాయకత్వమే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. నెంబర్ వన్, నెంబర్ 2 అనేది ఉంటే అది పార్టీ పతనానికి దారి తీస్తుంది. అందుకే నెంబర్ 2 ప్రాంతీయ పార్టీల్లో ఉండనే ఉండవు. అందుకే ఇప్పుడు కేసీఆర్ కు పెద్ద కష్టమే వచ్చిపడింది. ఏ తండ్రికీ రాని రాజకీయ నష్టం సొంత కుటుంబ సభ్యుల నుంచి వచ్చింది.

కేటీఆర్ కే పగ్గాలు...
బయట వ్యక్తులనయితే కేసీఆర్ అస్సలు లెక్క చేయరు. వెనువెంటనే పార్టీ నుంచి బయటకు పంపేవారు. కానీ ఇప్పుడు తన కుమార్తె కల్వకుంట్ల కవితను బయటకు పంపలేని పరిస్థితి. అలాగని కేటీఆర్ కు కాదని కవిత కు ప్రాధాన్యత ఇవ్వలేని స్థితి. గత కొంతకాలంగా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. క్యాడర్ నుంచి నేతలు కేటీఆర్ కు దగ్గరయ్యారు. తన రాజకీయ వారసత్వం కేటీఆర్ కు ఇవ్వాలని భావించి అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ కేటీఆర్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. అప్పుడే అందరికీ వారసత్వం విషయంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. బహుశ కవితకు కూడా అప్పుడే అర్థమయి ఉండాలి. కానీ ఇన్నేళ్లు ఆగి ఇప్పుడు రివర్స్ అయ్యారంటే కేవలం రాజకీయమొక్కటే కాదనే వారు కూడా ఉన్నారు.
ముందే తెలిసినా కేసీఆర్...
బీజేపీతో బీఆర్ఎస్ ను విలీనం చేయాలన్న ప్రతిపాదనను తాను వ్యతిరేకించినందునే తనపై పెయిడ్ ఆర్టిస్టుల చేత కొందరు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ కవిత ఫైర్ అయ్యారు. ఇంతకీ కవిత ఏం ఆశిస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత. ఆయనతో నేరుగా కలసి చెప్పుకునే అవకాశం ఉంది. ఒకవేళ చెప్పినా కేసీఆర్ కవిత ప్రతిపాదనలకు అంగీకరించకపోయి ఉండాలి. అందుకే కవిత బహిరంగంగానే తన సోదరుడు కేటీఆర్ పై నేరుగా బాణాలు గురిపెట్టారని అనుకోవాలి. కేసీఆర్ కు కూడా ఇది ముందే తెలిసి ఉంటుంది. కవిత తాను స్పష్టంగా లేఖల ద్వారా తెలియజేసినప్పుడే కేసీఆర్ కు అర్థమయి దానిని మొదట్లోనే తుంచి వేసే ప్రయత్నం చేయాల్సింది. కానీ కల్వకుంట్ల కవిత నుంచి ఇలాంటి రియాక్షన్ రాదని గులాబీ బాస్ ఊహించి ఉండవచ్చు.
క్యాడర్ లో అయోమయం...
అయితే బీఆర్ఎస్ లో అన్నా చెల్లెళ్ల వివాదం కారు పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంటుంది. సహజంగా కేటీఆర్ వైపు కేసీఆర్ మొగ్గు చూపే అవకాశాలున్నాయి. కేటీఆర్ ను కాదని కవిత వైపు కేసీఆర్ చూడకపోవచ్చని కూడా అంటున్నారు. మేనల్లుడు హరీశ్ రావు నుంచి ఈ ప్రమాదం ఎప్పుడైనా వస్తుందని భావించిన కేసీఆర్ కు కుమార్తె నుంచి రావడం మింగుడుపడని విషయమే. ఇద్దరినీ కలసి కూర్చోబెట్టి కేసీఆర్ రాజీ ప్రయత్నం చేసినా అది అతుక్కోలేనంత దూరం వెళ్లిపోయినట్లే కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు కేసీఆర్ కు వచ్చిన కష్టం మామూలుది కాదు. వదిలేసేది కాదు. కవితను ఇలానే వదిలేస్తే ఆమె చేసే వ్యాఖ్యలు పార్టీని మరింత డ్యామేజ్ చేస్తాయి. అందుకే కేసీఆర్ ఏం చేయనున్నారన్నది ఇప్పుడు గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ. మరి ఏం జరుగుతుందన్నది చూడాలంటే కొంత సమయం వెయిట్ చేయక తప్పదు.


Tags:    

Similar News