Gali Janardhan Reddy : జాతకం తిరగబడటం అంటే ఇదేనేమో?

గాలి జనార్థన్ రెడ్డి జైల్లో ఉక్కపోతకు మగ్గిపోతున్నారట. తనకు జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలంటూ పిటీషన్ వేశారు.

Update: 2025-05-14 07:53 GMT

కోట్లు ఉన్నప్పటికీ ప్రయోజనం ఏముంది? జీవితంలో ఎక్కువ భాగం జైలుకే పరిమితమయితే ఇక సంపాదించింది అనుభవించడం కూడా లేని అది దరిద్రమైన జాతకం గాలి జనార్థన్ రెడ్డిది. అక్రమంగానో.. ఎలాగోనో గాలి జనార్థన్ రెడ్డి కోట్లాది రూపాయలు కూడబెట్టారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గాలి కుటుంబం కర్ణాటకు వెళ్లి సెటిలయింది. కర్ణాటకలో అనేక వ్యాపారాలు చేసి కోట్లాది రూపాయలను కూడబెట్టింది. గాలి జనార్థన్ రెడ్డికి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో ఆయన కుమార్తెకు చేసిన వివాహంలో చేసిన హంగూ ఆర్భాటాలు చూస్తేనే అర్థమవుతుంది. బంగారు పళ్లేలు, నగలు, నట్రా.. ఇలా ఒకటేమిటి.. బంగారంతో పొదిగిన అన్నీ విలువైన వస్తువులు.

కాలుకదిపితే ఏసీలోనే...
కాలుకదిపితే ఏ కారు వస్తుందో ఆయనకు కూడా తెలియదు. ఇక ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఏసీల్లోనే గాలి సేదతీరతారు. అలాంటి గాలి జనార్థన్ రెడ్డి ఇప్పుడు చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు గాలి జనార్ధన్ రెడ్డితో పాటు మరో నలుగురికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. వీరిపై ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానాను కూడా విధించింది. గతంలోనూ కొన్నేళ్ల పాటు గాలి జనార్థన్ రెడ్డి శిక్ష అనుభవిస్తూ జైలు జీవితం గడిపారు. అయితే ఆ శిక్షను మినహాయించాలని కోరినా న్యాయస్థానం ఒప్పుకోలేదు. దీంతో గాలి జనార్థన్ రెడ్డి చంచల్ గూడ జైలులో నిందితుడిగా ఉంటూ ఉన్నారు.
జైల్లో సౌకర్యాలను కల్పించాలంటూ...
ఇంట్లోనే మనం ఉండలేకపోతున్నాం. ఇక బిజినెస్ మాగ్నెట్ అయిన గాలి జనార్థన్ రెడ్డి జైల్లో ఉక్కపోతకు మగ్గిపోతున్నారట. తనకు జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలంటూ గాలి జనార్థన్ రెడ్డి పిటీషన్ వేశారు. అయితే గాలి పిటీషన్ ప్రస్తుతం రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఈ కేసులో విచారించి ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ గాలి జనార్థన్ రెడ్డి జైలు జీవితం గడపలేకపోతున్నారని అర్థమవుతుంది. తనకు ఇంటి నుంచి భోజనంతో పాటు నిద్రించడానికి బెడ్, ఫ్యాన్ తో పాటు మరికొన్ని సౌకర్యాలు కోరుతున్నారు. పాపం చేసిన గాలికి ఈ శిక్ష సరిపోతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అక్రమాలకు అనుభవించాల్సిందేనంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం కూడా లేనట్లే.


Tags:    

Similar News