ఆసక్తికరంగా ఆ పార్టీ మేనిఫెస్టో

ఆసక్తికరంగా ఆ పార్టీ మేనిఫెస్టో.. ప్రజలు పట్టించుకుంటారా

Update: 2023-10-17 11:20 GMT

తెలంగాణ ఎన్నికల సమరం మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లాంటి ప్రధాన పార్టీలే కాకుండా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), వైఎస్ఆర్టీపీ, జనసేన, ప్రజాశాంతి పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు తమ తమ మేనిఫెస్టోలను విడుదల చేయగా.. బహుజన్ సమాజ్ పార్టీ కూడా మేనిఫెస్టోను విడుదల చేసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. 'బహుజన భరోసా' పేరుతో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణలోని మహిళా కార్మికులు, రైతులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, వాషింగ్ మెషీన్లు ఇస్తామని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) హామీ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికులకు ప్రతి సంవత్సరం 150 రోజుల పాటు కనీస రోజువారీ వేతనం రూ. 350తో ఉపాధి హామీ కల్పిస్తామని.. వారికి ఉచిత రవాణా, ఆరోగ్య బీమా కూడా అందించనున్నట్టుగా చెప్పారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని.. బీఎస్పీ అధికారంలోకి వస్తే ప్రతి మండలంలో ఒక అంతర్జాతీయ పాఠశాలను నెలకొల్పుతామని అన్నారు.

ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ అందిస్తామని బీఎస్పీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. కాన్షీ యువ సర్కార్ పేరిట యువతకు అయిదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆ పది లక్షల ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ప్రతి ఏడాది మండలానికి 100 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. ప్రతి సంవత్సరం రూ.25వేల కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు. భీమ్ రక్షా కేంద్రాల కింద వృద్ధులకు వసతి, ఆహారం, వైద్యం అందిస్తామన్నారు. రూ.5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని అన్నారు. వలస కార్మికులకు వసతి కల్పిస్తామని తెలిపారు.


Tags:    

Similar News