సీపీఐ నేత సురవరం కన్నుమూత
సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు.
సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. వయసు పెరగడంతో పాటు కొన్ని శ్వాసకోశ సమస్యలు ఏర్పడటంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. సురవరం సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25వ తేదీన జన్మించారు. విద్యార్థి దశ నుంచే కమ్యునిస్టు భావాజాలం అలవర్చుకున్న సురవరం సుధాకర్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయ విద్య పూర్తి చేశారు.
విద్యార్ధి దశ నుంచే...
విద్యార్థి సంఘ ఎన్నికల నుంచి ఆయన గెలుపు ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత 1974 నుంచి 1984 వరకూ సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. 1994లో డోన్ లో నాటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1988లో నల్లగొండ ఎంపీగా గెలిచిన సురవరం సుధారకర్ రెడ్డి 2000 సంవత్సరంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. 2004లో మళ్లీ నల్లగొండ లోక్ సభ ఎంపీగా గెలిచిన సురవరం తర్వాత సీపీఐ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గాపాల్గొన్న సురవరం సుధాకర్ రెడ్డి మరణంతో అనేక మంది రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.