Telangana : బీజేపీ గూటికి గువ్వల బాలరాజు.. ఫాంహౌస్ ఎమ్మెల్యేలు ఇక వరస పెడతారా?

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది

Update: 2025-08-10 12:19 GMT

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. అయితే ఇందులో ఆసక్తికరమయిన విషయం ఏంటంటే 2022లో మొయినాబాద్ ఫాం హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిందన్న వీడియోలు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బయటపెట్టారు. మూడేళ్ల క్రితం జరిగిన ఘటనను నాడు ఫేక్ అని వాదించిన బీజేపీ నేడు నిజం చేసేలా వ్యవహరిస్తుంది. నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులను కర్ణాటక బీజేపీ నేత బీఎల్ సంతోష్ తోపాటు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారన్న ఆరోపణలు వచ్చాయి.

నాడు ఉప ఎన్నికలకు ముందు...
అయితే మునుగోడు ఉప ఎన్నికలకు ముందు ఇది జరగడంతో అది నాడు సంచలనంగా మారింది. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బాగా దెబ్బతీసింది. నాటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు ఎమ్మెల్యేల కొనుగోలు ఒక కారణమయిందనే చెప్పాలి. దాని నుంచి తేరుకునేలా ఇప్పుడు వాటిని నిజం చేస్తుంది. కానీ దానిని బీజేపీ ఇప్పుడు అధికారికంగా నిజం చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే తాజాగా గువ్వల బాలరాజు బీజేపీ లోచేరడంతో మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ను వదిలి బీజేపీలో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది. గువ్వల బాలరాజు చేరిన తర్వాత మిగిలిన నేతలు కూడా త్వరలోనే కమలం తీర్థం కప్పుకుంటారని అంటున్నారు.
టిక్కెట్ రాదనే...
అయితే గువ్వల బాలరాజు మాత్రం బీజేపీలో చేరింది బీఆర్ఎస్ లో అసంతృప్తి కారణమని అంటున్నారు. ప్రధాన కారణం గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తాను నాగర్ కర్నూలు అభ్యర్థిత్వాన్ని కోరినా అధినాయకత్వం అంగీకరించలేదు. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బరిలోకి దించింది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తనకు అచ్చంపేట టిక్కెట్ ఇవ్వకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇస్తారని సమాచారం అందడంతోనే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిపోయారు. అయితే మిగిలిన ముగ్గురు మొయినాబాద్ ఫాం హౌస్ నేతలను కూడా పార్టీలోకి తీసుకుంటారన్న ప్రచారంలో వాస్తవమెంత అన్నది భవిష్యత్ లో తేలనుంది. అయితే మిగిలిన వారు బీజేపీలో చేరే అవకాశం లేదని కారు పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఎప్పుడు ఏమైనా జరగవొచ్చన్న వ్యాఖ్యలు కమలం పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News