Sigachi Industry Accident : సిగాచీ.. ఎంత మోసం.. ఎంత వంచన? పరిహారం ఎక్కడ?

సంగారెడ్డి జిల్లా సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో యాభై ఆరు మంది కార్మికులు చనిపోయారు. ఆ కుటుంబాలకు నేటి వరకూ పరిహారం అందలేదు

Update: 2025-07-30 04:22 GMT

సంగారెడ్డి జిల్లాలో జరిగిన సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో యాభై ఆరు మంది కార్మికులు చనిపోయారు. ఇందులో 46 మంది కార్మికులకు సంబంధించిన మృతదేహాలు, అవశేషాలు దొరకగా, మరో ఎనిమిది మందికి సంబంధించిన ఆనవాళ్లు కూడా లభించలేదు. సిగాచీ పరిశ్రమ యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా ఆ ఎనిమిది మంది చనిపోయి ఉంటారని ప్రకటించింది. అయితే సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశాకు చెందిన కార్మికులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాదస్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియో చెల్లించాలని కోరారు.

డెత్ సర్టిఫికెట్లు కూడా...
అందుకు సిగాచీ పరిశ్రమ యాజమాన్యం కూడా అంగీకరించి తాము కోటి రూపాయలు మృతి చెందిన వారి కుటుంబాలకు చెల్లిస్తామని, గాయపడిన వారికి ఉచితంగా తమ పరిశ్రమ తరుపున వైద్యసాయం అందిస్తామని చెప్పింది. అయితే ఇప్పటి వరకూ మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సిగాచీ పరిశ్రమ యాజమాన్యం కోటి రూపాయల పరిహారం చెల్లించలేదు. అయితే కొందరికి మాత్రం పదిహేను లక్షల రూపాయలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆచూకీ లభించని ఎనిమిది మందికి సంబంధించిన వారికి డెత్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదు. ప్రమాదం జరిగి నెల రోజులవుతున్నా ఇంతవరకూ పరిహారం చెల్లించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అగ్రిమెంట్ పై సంతకం చేయించుకుంటూ...
మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఇటు సిగాచీ పరిశ్రమ యాజమాన్యం పట్టించుకోవడం లేదని, అటు ప్రభుత్వం కూడా ప్రమాదం జరిగి ఇన్ని రోజులవుతుండటంతో దాని ఊసే మరిచిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సిగాచీ పరిశ్రమ ప్రమాదంపై ఏర్పాటయిన నిపుణుల కమిటీ ఇప్పటి వరకూ ప్రభుత్వానికి నివేదిక అందచేయలేదు. ప్రమాదానికి గల కారణం పాత మిషనరీ అని కార్మికులు చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకూ సిగాచీ పరిశ్రమ యాజమాన్యానికి సంబంధించి ఈ ఘటనలో ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంపై విపక్షాలు సయితం ప్రశ్నిస్తున్నాయి. పైగా మృతి చెందిన కార్మికుల కుటుంబాలలో కొందరికి పదిహేను లక్షలు ఇచ్చి వారిచేత అగ్రిమెంట్లపై సంతకం కూడా సిగాచీ పరిశ్రమ యాజమాన్యం పెట్టించుకుందని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని కార్మికుల కుటుంబాలు కోరతున్నాయి.
గాయపడిన వారికి...
ప్రమాదంలో గాయపడిన వారు కోలుకుంటున్నారు. మూడు నెలల పాటు పరిశ్రమను మూసివేస్తున్నట్లు సిగాచీ పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. అయితే గాయపడిన వారికి ఇంత వరకూ వారు కుటుంబాలు ఎలా జీవనం సాగిస్తారన్న దానిపై కూడా యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేదు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రం హడావిడి చేసి తామే అంతా చూసుకుంటామన్న సిగాచీ పరిశ్రమ యాజమాన్యం తర్వాత మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదన్నవిమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. యాజమాన్యం తప్పుకు కార్మికుల కుటుంబాలు బలవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకుని కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


Tags:    

Similar News