SLBC Accident : రోజురోజుకూ అడుగంటి పోతున్న ఆశలు.. ఇప్పటికే రెండు రోజులు దాటడంతో?

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఇప్పటి వరకూ బయటకు రాలేదు

Update: 2025-02-24 02:39 GMT

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ఇప్పటి వరకూ బయటకు రాలేదు. మూడు మీటర్ల మేర పై కప్పు కూలింది. ఎనిమిది మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు. రెండు రోజులుగా కార్మికులు టన్నెల్ లోనే చిక్కుకున్నారు. వారిని బయటకు తీసే ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నా సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అయితే రోజురోజుకూ వారు బతికి రావడంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. రెండు రోజుల నుంచి టన్నెల్ లోనే ఉండటంతో ఆక్సిజన్ అందడం కష్టంగా మారనుంది. అప్పటికీ ఆక్సిజన్ ను పంప్ చేస్తున్నప్పటికీ ఆశలు మాత్రం అడుగింటుతున్నాయి.

అడ్డంకిగా మారుతున్న...
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో మూడడగుల మేర నీరు నిలిచి ఉండటంతో పన్నెండు కిలోమీటర్ల మేరకు బురద పేరుకు పోయింది. ఎన్.డి.ఆర్.ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం ప్రయత్నిస్తున్నా వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. రెస్క్యూ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ కూడా పాల్గొంటుంది. అయినా లోపల కి వెళ్లేందుకు నీరు అడ్డంకిగా మారుతుంది. చివరకు అన్ని ప్రయత్నాలు చేసి లోపలకు ఆక్సిజన్ ను పంప్ చేస్తున్నారు. బురద, నీరు ఉండటంతో నెమ్మదిగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. . నీటిని తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎంత ప్రయత్నిస్తున్నా తిరిగి నీరు చేరుతుంది. బురద నీటిని తొలగించేంత వరకూ చిక్కుకుపోయిన వారిని రక్షించే అవకాశం లేదని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెబుతున్నారు.
పథ్నాలుగు కిలోమీటర్లు...
పథ్నాలుగు కిలోమీటర్లు లోపలకి వెళ్లి చూసినా కార్మికుల జాడ కనిపించలేదని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. రెండు రోజుల నుంచి మంచినీరు, ఆహారం లేకుండా ఉండటంతో వారు ఎంత మేరకు జీవించి ఉంటారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకు వచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. పథ్నాలుగు కిలోమీటర్ వద్ద పై కప్పు కూలడంతో అక్కడకు వెళ్లాలంటే కష్ట సాధ్యమవుతుంది. ఇప్పటి వరకూ కార్మికుల జాడను కనుగొనలేకపోయారు. నిన్ననే నాలుగు గంటల్లో ఆపరేషన్ ముగుస్తుందని భావించినా అది జరగలేదు. దీంతో ఇప్పుడు ఎంత సమయం పడుతుందన్నది చెప్పలేకపోతున్నారు. . ఎనిమిది మంది ప్రాణాలు టన్నెల్ లోనే ఉండటంతో ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు.


Tags:    

Similar News