వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం
వికారాబాద్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
వికారాబాద్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఉదయం 4 గంటల సమయంలో పరిగి పరిసర ప్రాంతాల్లో 3 సెకన్ల పాటు భూమి కంపించింది. రంగాపూర్, బసిపల్లి, న్యామత్‌నగర్ గ్రామాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. భారీ వర్షం కురుస్తున్న సమయంలో భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంప తీవ్రత గురించి తెలియాల్సివుంది.
గతంలో కూడా వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. 2024 ఫిబ్రవరిలో వికారాబాద్ జిల్లాలో 2.5 తీవ్రతతో స్వల్ప భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) నిర్ధారించింది. 2022లో కూడా జిల్లాలోని పరిగి మండలంలో భూమి కంపించిన సంఘటనలు ఉన్నాయి. గత మే నెలలో తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.