Ration Shops :మూడు నెలల రేషన్ కు ముగియనున్న గడువు.. క్యూ కడుతున్న జనం

తెలంగాణలో మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీకి గడువు ముగియనుంది.

Update: 2025-06-29 04:33 GMT

తెలంగాణలో మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీకి గడువు ముగియనుంది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండటంతో రేషన్ దుకాణాల వద్ద కార్డు దారులు బారులు తీరారు. మనిషికి ఆరు కేజీల చొప్పున నెలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మూడు నెలలకు సరిపడా పద్దెనిమిది నెలల బియ్యాన్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇంట్లో ఎంత మంది మనుషులున్నా అందరికీ ఒక్కొక్కరికీ పద్దెనిమిది కేజీల బియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పడంతో రేషన్ కార్డు దారులు ఈ నెల ఒకటో తేదీ నుంచి క్యూ కట్టారు.

రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో...
ఇప్పటి వరకు 92.18 శాతం మందికి రేషన్‌ సరఫరా పూర్తయిందని అధికారులు తెలిపారు. 5.27 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేసినట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. సాధారణంగా ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్‌దారులకు డీలర్లు బియ్యం ఇస్తారు. వర్షాకాలం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు జూన్‌తో పాటు జులై, ఆగస్టు రేషన్‌ను కూడా ఈ నెలలోనే ఇస్తున్నారు. మూడు నెలల రేషన్‌ పంపిణీ గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఇంకా ఎవరైనా లబ్ధిదారులు తీసుకోని వారు ఉంటే ఎల్లుండి వరకు రేషన్‌ షాపులకు వెళ్లి తీసుకోవచ్చని అధికారుల సూచిస్తున్నారు. రెండు రోజులే సమయం ఉండటంతో రేషన్ దుకాణాల వద్ద చాంతాండంత క్యూ కనపడుతుంది.
ప్రభుత్వ ఆదేశాలతో...
30వ తేదీ వరకు రేషన్‌ షాపులు తెరిచి ఉంచాలని పౌరసరఫరాల శాఖ ఆదేశించింది. అటు విడతల వారీగా కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పాత కార్డుల్లోనూ కుటుంబ సభ్యుల పేర్లను చేరుస్తోంది. ఈ క్రమంలోనే జూన్‌లో కొత్తగా రేషన్‌ కార్డులు మంజూరైన వారు.. రేషన్‌షాపులకు వెళ్లగా అక్కడ వారికి నిరాశే ఎదురవుతోందన్న ఫిర్యాదులు అందుతున్నాయి. కొత్తగా కార్డులు మంజూరైన వారికి సెప్టెంబర్‌ నెలలోనే బియ్యం వస్తాయని రేషన్‌ డీలర్లు చెబుతుండటంతో వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వ అధికారుల స్పందించాలని కొత్తగా మంజూరయిన రేషన్ కార్డు దారులు కోరుతున్నారు. ప్రభుత్వం తమను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Tags:    

Similar News