నేరాలు పెరిగాయ్.. 2021 వార్షిక నేర నివేదిక విడుదల : డీజీపీ మహేందర్

రాష్ట్ర ప్రజలు సహకరించడం వల్ల రాష్ట్రంలో ఎక్కడా మత ఘర్షణలు జరగలేదని.. ఒక్క నిర్మల్ జిల్లా భైంసాలోనే

Update: 2021-12-31 09:43 GMT

గతేడాదితో పోలిస్తే.. 2021 సంవత్సరంలో తెలంగాణలో నేరాలు పెరిగాయని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం వార్షిక నేర నివేదిక 2021 ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2021లో నేరాల్లో నిందితులకు శిక్షపడిన కేసులు 50.3 శాతమని తెలిపారు. 80 కేసుల్లో 126 మందికి జీవిత ఖైదు పడిందని డీజీపీ పేర్కొన్నారు. అలాగే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంలో ఉండాలని ప్రభుత్వం సూచించగా.. ఆ సూచనలను సమర్థవంతంగా అమలు చేసినట్లు డీజీపీ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 98 మంది నక్సలైట్లను అరెస్ట్ చేయగా.. మరో 133 మంది లొంగిపోయినట్లు తెలిపారు.

మత ఘర్షణలు లేవు
కాగా.. రాష్ట్ర ప్రజలు సహకరించడం వల్ల రాష్ట్రంలో ఎక్కడా మత ఘర్షణలు జరగలేదని.. ఒక్క నిర్మల్ జిల్లా భైంసాలోనే మత విద్వేష ఘర్షణలు జరిగాయని తెలిపారు. అలాగే డయల్ 100కు ఈ ఏడాది 11.24 లక్షల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో ఫిర్యాదు వచ్చిన 5 నిమిషాల్లోనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారని తెలిపారు. ఫిర్యాదులు చేసేందుకు వచ్చేవారి కోసం 800 స్టేషన్లలో రిసెప్షన్లను ఏర్పాటు చేశామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. 2021 సంవత్సరంలో షీ టీమ్స్ లో 5,145 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో బాధితులకు భరోసా కల్పించామని వెల్లడించారు.
రోడ్డుప్రమాదాల్లో 6,690 మంది మృతి
ఇక హాక్ ఐ ద్వారా 83 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని డీజీపీ వివరించారు. ఎన్ని కేసులు పెట్టినా తరచూ నేరాలకు పాల్పడుతున్న 664 మందిపై పీడీ యాక్ట్ పెట్టినట్లు తెలిపారు. ఇక, ఈ ఏడాది 8,828 సైబర్ నేరాలు నమోదైనట్టు డీజీపీ చెప్పారు. అలాగే వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డుప్రమాదాల్లో 6,690 మంది మరణించారని వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.879 కోట్ల జరిమానాలు విధించినట్లు తెలిపారు. దొంగతనాలను అరికట్టేందుకు 2021లో రాష్ట్రంలో 8.5 లక్షల సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మొత్తం మీద గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది క్రైం రేటు 4.6 శాతం పెరిగిందని పేర్కొన్నారు.



Tags:    

Similar News