రైతుబంధు నిధులపై బీఆర్‌ఎస్‌ ఆరోపణలకు కాంగ్రెస్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

రైతుబంధు నిధుల విషయంలో బీఆర్‌ఎస్‌ ఆరోపణలకు గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. మరోవైపు 27 లక్షల మంది రైతులకు

Update: 2024-01-07 15:37 GMT

BRS - Congress

రైతుబంధు నిధుల విషయంలో బీఆర్‌ఎస్‌ ఆరోపణలకు గట్టిగా కౌంటర్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. మరోవైపు 27 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు నిధులు జమ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు సకాలంలో రైతుబంధు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ నేపథ్యంలో రైతుబంధుపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే అంశంపై బీఆర్ఎస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తోంది. డిసెంబర్‌ 9నే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని.. కానీ ఇప్పటివరకు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే రైతుబంధు నిధుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్‌ఎస్‌ సంచలన ఆరోపణలు చేసింది. రైతు బంధు నిధులు రాఘవ కన్‌స్ట్రక్షన్‌కు మళ్లించారని బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ ఆరోపిస్తూ, దీనిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

ఆరోపణలపై ఖండించిన కాంగ్రెస్‌

బాల్క సుమన్‌ ఆరోపణలను కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్‌ నేతల మాటలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలేదన్నారు. మరోవైపు రైతుబంధు నిధుల విడుదలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 27 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధును వెంటనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, రైతులకు సకాలంలో రైతుబంధు అందించేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తుమ్మల. రైతుబంధు నిధుల విడుదలపై రైతులు, ప్రజలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా రైతుబంధు అందేలా చూస్తామన్నారు.

Tags:    

Similar News