Telangana : జూబ్లీహిల్స్ లో గెలవాల్సిందే...కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ గా మారనుందా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి హైదరాబాద్ నగరంలో పార్టీ ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తుంది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి హైదరాబాద్ నగరంలో పార్టీ ఎమ్మెల్యే ఉండేలా ప్లాన్ చేసింది. గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు కూడా రాలేదు. అయితే తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మాత్రం సీటు గెలిచింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఫోకస్ పెట్టింది. ఉప ఎన్నికల్లో గెలిచి గత రెండేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతున్నారన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళుతుంది. అందుకే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నేడు గాంధీ భవన్ లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ లో కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.
అనేక మంది పోటీ పడుతున్నా...
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. అయితే త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. ఈ ఎన్నికలో గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందన్న భావన ఎక్కువగా కలగడంతో ఎక్కువ మంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం సినిమా ఇండ్రస్ట్రీకి చేస్తున్న ప్రయోజనాలు, గద్దర్ అవార్డులు, కార్మికులు సమ్మెను పరిష్కరించడం వల్ల తమకు అక్కడ ఓట్లు పడతాయని భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలుపు ఖాయమని భావించి పోటీకి సిద్ధమవుతున్నారు.
అభ్యర్థి ఎవరన్నది...
గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేశారు. ఆయన మాగంటి గోపీనాధ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పటికే బయట నియోజకవర్గాల నుంచి వచ్చి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని వచ్చిన నేతలకు టిక్కెట్ దక్కదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడంతో లోకల్స్ కే టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్ హస్తిన స్థాయిలో తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు కావడంతో ఆయనకు అవకాశాలు ఎక్కువ అని అంటున్నారు. హైకమాండ్ ఆశీస్సులు కూడా ఉన్నాయంటున్నారు. అయితే సర్వే చేయించిన తర్వాత అభ్యర్థిని ఖరారు చేసేందుకు అవకాశాలున్నాయి. ఈరోజు మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంత్రులు అక్కడ తరచూపర్యటిస్తుండటం చేయాలని సమావేశం నిర్ణయించే అవకాశముంది.