Telangana Congress : కాంగ్రెస్ నేతలను కట్టడి చేసే వారే లేరా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న మాటే కానీ ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం మాత్రం కనిపించడం లేదు

Update: 2025-10-21 12:05 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న మాటే కానీ ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం మాత్రం కనిపించడం లేదు. పైగా వీలయినప్పుడు తమ అసంతృప్తిని, అసహనాన్ని వెళ్లగక్కేందుకు నేతలు ఏ మాత్రం వెనకాడటం లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బతీసేది ఆ పార్టీ నేతలేనన్న కామెంట్స్ గాంధీభవన్ దాకా వెళ్లినప్పటికీ పెద్దగా పట్టించుకోవడం లేదు. నేతల మధ్య విభేదాలు, అసంతృప్తుల విషయంలో హస్తినలోని పార్టీ నాయకత్వం కూడా జోక్యం చేసుకోవడం లేదు. రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు తెలంగాణలో అనేక దఫాలు పర్యటించి ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తున్నారు? నేతల మధ్య సమన్వయం ఉందా? అన్న దానిపై కనీసం ఇక్కడకు వచ్చి ఒక్క సమావేశాన్ని కూడా పెట్టలేదు.

పెద్దాయన ఆక్రోశాన్ని...
దీంతో కాంగ్రెస్ లో ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా తయారైంది. జగిత్యాల పర్యటనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను సీనియర్ నేత జీవన్ రెడ్డి నిలదీసినంత పనిచేశారు. కాంగ్రెస్ ను సుదీర్ఘకాలంగా అంటిపెట్టుకున్న వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేశానికి లోనయ్యారు. జగిత్యాల నియోజకవర్గానికి ఏ మంత్రి వెళ్లినా జీవన్ రెడ్డి తన వర్గానికి అన్యాయం జరుగుతుందంటూ గళమెత్తుతున్నారు. కానీ ఆయనను పిలిచిఆయన సమస్యలు ఏంటో తెలుసుకుని వాటిని పరిష్కరించుకునే వారు లేరు. దీంతో జీవన్ రెడ్డి అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. అక్కడ పేరుకు ప్రతిపక్షం లేదన్న మాటే కానీ కాంగ్రెస్ లోని నేతలే విపక్షంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నేతలు బాహాటంగానే...
ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను కూడా ముఖ్యమంత్రిని అవుతానంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిత్యం పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు. ఇక కొండా దంపతుల వ్యవహారం ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. మేడారం టెండర్ల వ్యవహారం కూడా బహిరంగంగానే వివాదంగా మారింది. దీంతో జనంలో పార్టీ పలుచన అయింది. అయినా సరే ఇక్కడి నాయకత్వం కాకుండా ఢిల్లీ స్థాయిలో సీరియస్ గా చర్యలు తీసుకుంటే తప్ప నేతలు దారిలోకి రారు. కానీ పార్టీ అగ్ర నాయకత్వం మాత్రం ఆ చర్యలు చేపట్టడం లేదు. దీంతో కాంగ్రెస్ నేతలు పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీకి మరింత నష్టం చేకూర్చనుంది.
Tags:    

Similar News