Congress : ఐదు గ్యారంటీలతో దేశ ముఖచిత్రం మారబోతుంది

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ మ్యానిఫేస్టోను విడుదల చేశారు

Update: 2024-04-06 14:16 GMT

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ మ్యానిఫేస్టోను విడుదల చేశారు. తుక్కుగూడలో జరిగిన సభలో ఆయన న్యాయపత్రాన్ని ఆవిష్కరించారు. ఐదు గ్యారంటీల పత్రాన్ని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా విడుదల చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఐదు వందలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు వంటి గ్యారంటీలను అమలు చేశామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఇక్కడే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మ్యానిఫేస్టోను విడుదల చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఐదు గ్యారంటీలను...
తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నట్లుగానే జాతీయ స్థాయిలో కూడా గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ మ్యానిఫేస్టో కాదని, ప్రజల గొంతుక అని అన్నారు. ఈ మ్యానిఫేస్టోలోనూ ఐదు గ్యారంటీలున్నాయన్నారు. అందులో ఒకటి దేశంలో నిరుద్యోగులందరికీ లక్ష రూపాయల జీతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలిపారు. దేశంలో యువతకు అప్రెంటిస్ కు నైపుణ్యంలో శిక్షణ ఇస్తామని తెలిపారు. దేశంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఏడాది శిక్షణ ఇప్పించబోతున్నామని తెలిపారు. యువతకు సంబంధించిన మరికొన్ని కీలకమైన అంశాలను కూడా ఈ మ్యానిఫేస్టోలో పొందుపర్చామన్నారు.
ఒక్కొక్క మహిళకు లక్ష...
మహిళలకు అవసరమైన పథకాలను కూడా తీసుకువస్తున్నామని తెలిపారు. మహిళ న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మహిళ బ్యాంకు అకౌంట్ లో లక్ష రూపాయలు ఏడాదికి ఇవ్వనున్నామని తెలిపారు. ఇది విప్లవాత్మకమైన మార్పు అని అన్నారు. ఈ నిర్ణయంతో దేశం ముఖ చిత్రమే మారబోతుందన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు కూడా ఈ మ్యానిఫేస్టోలో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించామన్నారు. రైతు న్యాయం గ్యారంటీ కింద రుణమాఫీ చేస్తామని తెలిపారు. కనీస మద్దతు ధరను కూడా ప్రతి పంటకు కల్పిస్తామని చెప్పారు. ఎంఎస్ స్వామినాధన్ సిఫార్సుల మేరకు మద్దతు ధరలను కల్పించబోతున్నామని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడుతూ...
కార్మికుల సంక్షేమం కోసం కనీస వేతనాలను తీసుకు వచ్చేలా చట్టం తీసుకువస్తామని తెలిపారు. రోజుకు కనీస వేతనం నాలుగు వందలు ప్రకటిస్తామని తెలిపారు. దేశంలో 90 శాతం ఉన్న పేదలందరికీ న్యాయంచేస్తామని అన్నారు. దేశంలో కులగణన చేయబోతున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని తెలిపారు. గత ముఖ్యమంత్రి నేతల ఫోన్లు ట్యాప్ చేసి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. బలవంతపు వసూళ్లు చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారన్నారు. దీనిపై విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. ఢిల్లీలో మోదీ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుందన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీలను తమ జేబు సంస్థలుగా వినియోగించుకుంటుందన్నారు. బీజేపీ పెద్ద వాషింగ్ మెషీన్ లాంటిదని, అత్యంత అవినీతి పరులందరూ మోదీ పక్కనే నిలబడి ఉన్నారని అన్నారు.


Tags:    

Similar News