కేసీఆర్‌ చీఫ్ మినిస్టర్ నహీ హై.. యే రాజా హై.. ఏకిపారేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రాహుల్ వరంగల్ సభా వేదిక నుంచి హామీ ఇచ్చారు.

Update: 2022-05-06 14:40 GMT

వరంగల్ రైతు సంఘర్షణ దీక్షకు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ ఒక్కరి వల్లో తెలంగాణ రాలేదని.. ఏ ఒక్కరి కోసమో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని పార్టీ నష్టపోయినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని రాహుల్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చూసి చలించిపోయి కొత్త రాష్ట్రం ఇచ్చారని అన్నారు.

నూతన రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణలో ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించామని.. కానీ అలా జరగలేదని రాహుల్ అన్నారు. ఇక్కడ ఒకాయన ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన ప్రజాస్వామిక ముఖ్యమంత్రి కాదన్నారు. ఆయన ఓ రాజా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి.. కానీ రాజు అలా చేయడు. వాళ్లు చేసిందే రాజ్యమన్నట్లుగా వ్యవహారం తయారైందని ఆయన అన్నారు. తెలంగాణ వల్ల ఒకే ఒక్క కుటుంబం బాగుపడిందంటూ ఘాటు కామెంట్స్ చేశారు.

వరిధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై రాహుల్ స్పందించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ముందు రెండు హామీలిచ్చామని.. రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పామన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. వరి క్వింటాళ్‌కి రూ.2,500 ఇస్తున్నామని.. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదన్నారు. అయినా తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. తెలంగాణ రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు.

Tags:    

Similar News