Telangana : లోకల్ ఎలక్షన్స్ సానుకూల వాతావరణంలోనే జరపాలనేనా?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతుంది.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతుంది. అక్టోబరు నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. వాస్తవానికి హైకోర్టు ఈ నెలాఖరులోపే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే బీసీ రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని అందుకు అవసరమైన చర్యలకు సిద్ధమవుతుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీ చేసి గవర్నర్ కు పంపింది. గవర్నర్ రాష్ట్రపతి కి పంపారు. ఆ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఇంత వరకూ ఆమోదం తెలపలేదు. మరొకవైపు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపింది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా తీర్మానాన్ని ఆమోదించలేదు.
హైకోర్టు ఇచ్చిన గడువు...
దీంతో హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో ఎన్నికల నిర్వహణకు మరో రెండు నెలల సమయం కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసి రిజర్వేషన్లు అమలు చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉంది. పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలను దశలవారీగా రెండు నెలల్లో పూర్తి చేసేందుకు తమకు తగిన సమయం ఇవ్వాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేసింది. బ్యాలట్ బాక్స్ లను కూడా ఎక్కడికక్కడ సిద్ధం చేసింది. రిజర్వేషన్ల విషయంలో క్లారిటీ రానందుకే తమకు సమయం కావాలని హైకోర్టును కోరనుంది.
యూరియా కొరత వంటి సమస్యలు...
ఈలోపు యూరియా కొరత వంటి అంశాలు కూడా తెరమరుగయ్యే అవకాశముందని తెలిసింది. ఇప్పటి కంటే రెండునెలల్లో తమకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేస్తుంది. అక్టోబరు నుంచి నవంబరు నెల అయితే తమకు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశముందని, ఈలోపు ఇచ్చిన హామీలలో మిగిలిపోయిన వాటిని కూడా అమలు చేసే అవకాశం ఉంటుందని భావిస్తుంది. అందుకే రెండు నెలల పాటు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అయితే దసరా కంటే ముందుగానే మంత్రులతో మరోసారి సమావేశమై న్యాయస్థానానికి వెళ్లే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది.