Weather Report : మూడు రోజులు బయటకు రావద్దు.. గడ్డకట్టిపోతారంతే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దయచేసి ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో బయటకు రావదని అలెర్ట్ జారీ చేసింది. దీంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు కూడా పడే అవకాశముందని తెలిపింది. చలి తీవ్రత రాను రాను తీవ్రత ఎక్కువ అవుతుందని, సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలిపింది. ఈ సమయంలో వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, చిన్నారులు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. ఈ చలిగాలుల తీవ్రత కారణంగా అనేక వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయని వార్నింగ్ ఇచ్చింది.
ఏపీలో వానలు.. చలితీవ్రత...
ఆంధ్రప్రదేశ్ లో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వానలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పింది. చలిగాలుల సమయంలో ప్రయాణాలు పెట్టుకోవద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉదయం వేళ పొగమంచు అధికంగా ఉంటుందని తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోయే అవకాశమున్నందున చలి నుంచి కాపాడుకోవడానికి అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసర సమయంలో బయటకు రావాలనుకుంటే స్వెట్టర్లు ధరించడం, మంకీ క్యాప్ లు పెట్టుకుని బయటకు రావడం మంచిదని, ఈ చలిగాలుల వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని కూడా వైద్యులు తెలిపారు.
తెలంగాణలో చలిగాలులు...
తెలంగాణలోనూ చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. ఇప్పటికే తెలంగాణలోని ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ నగరం వంటి ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, సంారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిర్మల్, హైదరాబాద్ జిల్లాల్లో నేడు చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశముందని పేర్కొంది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలిపింది. సాధారణం ఉష్ణోగ్రతలు కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.