Congress : రాహుల్ నిర్ణయమే ఫైనల్.. ఆయన మనసులో ఎవరున్నారంటే?

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యత అధినాయకత్వానికి అప్పగిస్తూ సీఎల్పీ తీర్మానించింది.

Update: 2023-12-04 08:06 GMT

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను అధినాయకత్వానికి అప్పగిస్తూ సీఎల్పీ సమావేశం తీర్మానించింది. ఇక పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో సోనియా గాంధీ జోక్యం కూడా ఉండకపోవచ్చు. ఆమె తెలంగాణ రాజకీయ నేతలకు తెలుసు కానీ.. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా ఆమెకు తెలియవు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా పొలిటికల్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎవరికి ఇస్తే ఏంటి? పార్టీకి ప్రయోజనమా? నష్టమా? భవిష్యత్ లో జరిగే పరిణామాలు వంటి వాటి గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో నిర్ణయానికి ఆమె దూరంగా ఉంటారనే అనుకోవాలి.

ఎన్నికల ప్రచారంలో...
ఇక తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రచారాన్ని అంతా తానే భుజానికి ఎత్తుకున్న రాహుల్ గాంధీ నిర్ణయం మేరకే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నది కాదనలేని వాస్తవం. ఏఐసీసీ అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు కోసం రాహుల్ వైపు చూసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో రాహుల్ మనసులో ఎవరున్నారు? భవిష్యత్ రాజకీయాలను నడపే శక్తి, సత్తా ఉన్న నేత ఎవరన్నది రాహుల్ గాంధీకి తెలుసు. ఆయన నిర్ణయం ఫైనల్ అవుతుంది. ఖర్గే మామూలుగా ప్రకటిస్తారు తప్పించి రాహుల్ సూచనల మేరకే నడుచుకుంటారు. అలాగే తెలంగాణ ఎన్నికలలో ప్రచారం చేసిన ప్రియాంక గాంధీ జోక్యం కూడా తక్కువగానే ఉంటుంది.
అందరితోనూ...
రాహుల్ ఇక్కడ అందరి నేతలతో కలివిడిగానే ఉంటారు. ప్రచారానికి వచ్చిన సమయంలోనూ ఆయన ఎవరికీ దగ్గరగా కనిపించలేదు. అలాగే ఎవరికీ దూరంగా కూడా కనపడ లేదు. అంటే ఆయన మనసులో ఎవరో ఒకరు ఉండాలి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను తెచ్చి పెట్టే వారికే పట్టం కట్టేందుకే రాహుల్ నిర్ణయం ఉంటుందన్నది వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు మధ్య పెద్దగా ఓట్ల శాతంలో తేడా లేదు. బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో బలపడింది. బీజేపీ, బీఆర్ఎస్ ను తట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించిపెట్టే నేతను ఆయన ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఆయన అన్ని రకాలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
లోక్‌సభ ఎన్నికలను...
రేవంత్ రెడ్డి ఇప్పటికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చామని భావిస్తే... ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కకు ఇవ్వవచ్చు. అలాగే ఆయన కూడా సీఎల్పీ పదవిలో మొన్నటి వరకూ కొనసాగారు కాబట్టి మరొక కొత్త వ్యక్తికి కూడా అవకాశం దక్కేందుకు కూడా అంతే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందరిని కలుపుకుని పోయే వారిని, రాజకీయంగా భవిష‌్యత్ లో ఇబ్బందులు తలెత్తకుండా నేతను ఎంపిక చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సీల్డ్ కవర్ లో ఎవరి పేరు ఉంటుందన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అందరూ రేవంత్ రెడ్డి కావాలని భావించరు. అలాగే భట్టి విక్రమార్కను కూడా. ఎవరికి వారే తమ అభిప్రాయాలు ఉన్న తరుణంలో రాహుల్ గాంధీ నిర్ణయం పైనే ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఇందుకు మరింత కొంత సమయం పట్టే అవకాశముంది.
Tags:    

Similar News