Telangana : తెలంగాణా ఆదాయంపై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
లంగాణ ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
తెలంగాణ ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రతి నెలా 22,500 కోట్ల రూపాయలు అవసరమన్న ఆయన ప్రస్తుతం ఆదాయం 18,500 కోట్ల రూపాయలు మాత్రమే వస్తుందని తెలిపారు. ఇందులో జీతాలకు 6,500 కోట్లు, గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలకు 6,800 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అందుకే ఆదాయాన్ని పెంచేందుకు తాము కృషిచేస్తున్నామని తెలిపారు. ఎస్.ఎల్.బి.సిలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమన్న ఆయన పదేళ్లుగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు జరగలేదన్నారు.
ఎస్.ఎల్.బి.సి ప్రమాదంపై...
కాంగ్రెస్ కు పేరు వస్తుందనే ఈ పనులను కేసీఆర్ పక్కన పెట్టారన్న రేవంత్ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పనులు మొదలయ్యాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ లో పదకొండు సంస్థలు పనిచేస్తున్నాయని, లోపలచిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఎస్.ఎల్.బి.సి వద్ద జరిగింది ప్రమాదమని, కాళేశ్వరంలో జరిగింది డిజైన్, నిర్మాణలోపమని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశాన్నికేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని రేవంత్ ఆరోపించారు.