Revanth Reddy : గోదావరి పుష్కరాలపై రేవంత్ సమీక్ష
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు.
పుష్కరాలకు...
2027లో జులై 23వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇప్పటి నుంచి దాదాపు 22 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీర ప్రాంతముంది. దాదాపు 74 చోట్ల పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముంటుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాలను మొదటగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆలయ పరిసరాల్లోని పుష్కర ఘాట్ల అభివృద్ధిని మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని చెప్పారు. ఆలయ అభివృద్ధితో పాటు అక్కడ శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.