గ‌ద్ధ‌ర్ మృతి చాలా బాధ, ఆవేదన కలిగించింది : చంద్రబాబు

ఇటీవ‌ల మ‌ర‌ణించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు

Update: 2023-08-15 07:54 GMT

ఇటీవ‌ల మ‌ర‌ణించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. గద్దర్ కుటుంబ సభ్యులను కలిసిన‌ చంద్రబాబు నాయుడు.. గద్దర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దర్ నివాస పరిసర ప్రాంతాలు చంద్రబాబు నాయుడు రాకతో కిక్కిరిసిపోయాయి. గద్దర్ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గద్దర్ చనిపోవడం బాధాకరమ‌న్నారు. గ‌ద్ద‌ర్ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అని అన్నారు. ప్రజా చైతన్యంలో మొదట గుర్తు వచ్చే వ్యక్తి గద్దర్ అని పేర్కొన్నారు. ఆయన పాట, ఆయన కృషి ఎప్పటికి మర్చిపోలేమన్నారు. పేదల హక్కుల మీద రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి గ‌ద్ద‌ర్ అని కొనియాడారు. తాము రాజకీయాల్లో ఉండి ప్రజా చైతన్యం కోసం పని చేస్తే.. గద్దర్ ప్రజలు, పేదల హక్కుల పరిరక్షణ కోసం ఒక పందా ఎన్నుకొని కృషి చేసారని.. పోరాటాలకు నాంది పలికారని అన్నారు. తెలంగాణ పోరాటం లో ఎంతో కృషి చేసారని అన్నారు. ఆయనను చూస్తేనే ప్రజా యుద్ధ నౌక గుర్తు వస్తుందన్నారు. దేనికి భయపడని వ్యక్తి.. పొరాటాలే ప్రాణంగా బతికారన్నారు. ఆయన స్పూర్తి శాశ్వతంగా ఉంటుందన్నారు. ఆయన త్యాగాల ఫలితం లక్షల అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. పెద్ద వయసు కాదు గద్దర్ ది.. తెలుగు జాతి మంచి ఉద్యమ కారున్ని కోల్పోయిందన్నారు. ఆయన మృతి చాలా బాధ, ఆవేదన కలిగించిందని విచారం వ్య‌క్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని.. కుటుంబ సభ్యులు ఆయన ఆశయాలు కొనసాగించాలని కోరారు.


Tags:    

Similar News