KTR : కేటీఆర్ మాస్ ఇమేజ్ కావాలనుకుంటున్నారా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ ను మించి పోయినట్లనిపిస్తుంది.

Update: 2025-04-17 12:32 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ ను మించి పోయినట్లనిపిస్తుంది. పార్టీని బలోపేతం చేసే విషయంలో కాదు.. ప్రత్యర్థి పార్టీ నేతలను తూలనాడటంలో మాత్రం కేసీఆర్ కంటే రెండాకులు కేటీఆర్ ఎక్కువే చదివినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇష్టమొచ్చినట్లు దూషణలకు దిగుతుండటం చూసేవారికి, వినేవారికి అదే ఏవగింపుగా ఉంది. ముఖ్యమంత్రిని పిరికి సన్నాసి అంటూ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినపడుతున్నాయి. రేవంత్ రెడ్డి తన ప్రత్యర్థి కావచ్చు. కానీ ఆయన పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని కాదని ప్రజల తీర్పు మేరకు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విషయాన్ని కేటీఆర్ మర్చిపోతున్నట్లుంది.

అలా అయితేనే...?

ప్రతి విషయంలో రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే హీరోయిజం వర్క్ అవుట్ అవుతుందని కేటీఆర్ భావిస్తున్నట్లుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవికి ఎవరైనా గౌరవం ఇవ్వాలి. అంతే తప్పించి రేవంత్ రెడ్డి ఆ పదవి లో ఉండగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు కూడా అసహ్యించుకుంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన భాష నాడు బాగా వర్క్ అవుట్ అయి ఉండవచ్చు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి పదకొండేళ్లు పైనే అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ సన్నాసి అంటూ కామెంట్స్ చేయడాన్ని మాత్రం చాలా మంది తప్పు పడుతున్నారు. కేటీఆర్ కేసీఆర్ లాగా మాస్ పొలిటికల్ లీడర్ కాదు. ఆయన ఉన్నత చదువులు కొని సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని విదేశాల్లో చేసి వచ్చిన వ్యక్తి.
కేసీఆర్ కు మించి...
కేసీఆర్ మాట్లాడితే వయసులో పెద్దవాడిగా కొంత వరకూ సరిపెట్టుకుంటారు కానీ, అదే కేటీఆర్ మాట్లాడితే మాత్రం సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా దుమ్మెత్తి పోస్తున్నారు. మాస్ ఇమేజ్ ను తెచ్చిపెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే కేటీఆర్ ఇలాంటి భాషను ఉపయోగిస్తున్నారని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా విమర్శలు చేస్తే ముఖ్యమంత్రిపై హుందాగా రాజకీయ విమర్శలు చేయాలి తప్పించి, వ్యక్తిగత దూషణలకు దిగితే అది బూమ్ రాంగ్ అవ్వకతప్పదన్న హెచ్చరికలు కూడా కేటీఆర్ కు బలంగా వినిపిస్తున్నాయి. మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టుకుంటే రాదని, అది పుట్టుకతో రావాలని, తన తండ్రిని మించి మాట్లాడాలనుకుని కేటీఆర్ ఇలా నోరు పారేసుకుంటున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Tags:    

Similar News