BRS : కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు వారేనా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎయిర్ పోర్టులో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎయిర్ పోర్టులో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అసలు కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ ఎవరు? పక్కన ఉన్న దెయ్యాలు ఎవరు? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మాత్రమే కాదు.. గులాబీ పార్టీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది సంవత్సరాల నుంచి కల్వకుంట్ల కవిత మాత్రమే కేసీఆర్ ను దగ్గర నుంచి చూసి ఉంటారు. ఎందరో నేతలు చూస్తున్నా నిరంతరం కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ పై కవితకు మాత్రమే ఖచ్చితమైన సమాచారం అందుతుంది. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నప్పటికీ అక్కడకు వచ్చి ఎవరెవరు కలుస్తున్నారన్న దానిపై కవితకు ఎప్పటికప్పుడు నివేదిక అందించేవారు కూడా లేకపోలేదు.
హాట్ టాపిక్ గా మారి...
దీంతో కల్వకుంట్ల కవిత కామెంట్స్ చేసిన కోటరీ, దెయ్యాలు ఎవరన్న దానిపైనే చర్చ జరుగుతుంది. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ లో కోవర్టులను పక్కకు తప్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. కేసీఆర్ దేవుడని, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్నారంటే కవితకు అక్కడ కేసీఆర్ ను ప్రభావితం చేస్తున్నది ఎవరన్నది పక్కాగా తెలిసిన తర్వాత మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశారు. తాను రెండు వారాల క్రితం తాను కేసీఆర్‌కు లేఖ రాస్తే, దానిని ఇప్పుడు బయటపెట్టడంపై కూడా కవిత ఆశ్చర్యపోయారు. తనపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్న కవిత కేసీఆర్ కుమార్తెనైన తాను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటని కవిత అన్నారంటే దాని వెనక పెద్ద హస్తాలే ఉన్నట్లు ఆమెచెప్పకనే చెప్పారు.
వారు వీరేనా?
కల్వకుంట్ల కవిత అనుమానం నలుగురిపైనే ఉనట్లు గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది. ఒకటి తన సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు కాగా, రెండో వ్యక్తి కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు, సంతోష్ తో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డిపైనే అనుమానం ఉన్నట్లు పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. కేసీఆర్ వద్దకు స్వతంత్రగా వెళ్ళి చర్చించే సమయం, వీలు ఈ నలుగురికి మాత్రమే ఉంటుందని కవిత అనుమానంగా చెబుతున్నారు. అందుకే పేర్లు నేరుగా చెప్పకుండా కేవలం దెయ్యాలంటూ అనడంతో నేరుగా వారితో వార్ కు కవిత సిద్ధమయ్యారనే అర్థమవుతుంది. ఈ నలుగురు మాత్రమే తనను కేసీఆర్ కు దూరం చేశారన్న బాధ కూడా కల్వకుంట్ల కవితలో కనపడుతుంది. అందుకే దెయ్యాలంటూ.. కోటరీ అంటూ ఆ నలుగురిని కవిత టార్గెట్ చేశారంటున్నారు. అయితే దీనిపై ఎవరూ స్పందించకపోవడానికి కూడా కవితతో పెట్టుకోవడం ఎందుకని అందరూ మౌనంగా ఉంటున్నారు.