Kalvakuntla Kavitha in Tihar Jail: కవిత తొలిరోజు తీహార్ జైలులో ఇలా గడిపారట

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తొలి రోజు తీహార్ జైలులో గడిపారు. ఆమె రాత్రంతా నిద్రపోకుండా ఉన్నారని చెబుతున్నారు

Update: 2024-03-27 02:58 GMT

Kalvakuntla Kavitha in Tihar Jail:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తొలి రోజు తీహార్ జైలులో గడిపారు. ఆమె రాత్రంతా నిద్రపోకుండా ఉన్నారని చెబుతున్నారు. ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని కూడా ఆమె సరిగా తినలేదని అంటున్నారు. పుస్తకాలు ఉన్నప్పటికీ వాటిని కాసేపు చూడటం, మరికాసేపు ఆలోచనల్లో ఉంటూ కవిత కనిపించారని జైలు అధికారులు చెబుతున్నారు. కల్వకుంట్ల కుటుంబంలో తొలి సారి జైలు కు వెళ్లిన కవిత తొలిరోజు తీహార్ జైలులో అన్యమనస్కంగానే గడిపారని తెలుస్తోంది. ఆమె వద్దకు వచ్చిన జైలు సిబ్బందిని కూడా పలుకరించలేదని చెబుతున్నారు.

ఏప్రిల్ 9వ తేదీ వరకూ...
ఈ నెల 15వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన కవితను పది రోజుల పాటు ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఈడీ ప్రధాన కార్యాలయం కావడం, అక్కడ సాయంత్రానికి కుటుంబ సభ్యులను, న్యాయవాదులను కలిసే అవకాశముండటంతో కవిత పెద్దగా ఇబ్బంది పడలేదు. అయితే నిన్న ఏప్రిల్ 9వ తేదీ వరకూ కవితను జ్యుడిషియల్ రిమాండ్ కు విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పడంతో ఆమెను అధికారులు తీహార్ జైలుకు తరలించారు.
మినహాయింపులు ఇచ్చినా...
అయితే కవితకు కొన్ని మినహాయింపులు ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తీహార్ జైలులో ఉన్న కవితకు ఇంటి నుంచి వచ్చే భోజనంతో పాటు అవసరమైన మందుుల, పెన్ను, పుస్తకాలు, పేపర్స్, బెడ్‌షీట్, బ్లాంకెట్ వంటివి వాడుకునేందుకు అనుమతించింది. తిరిగి వచ్చే నెల 9వ తేదీ ఉదయం 11 గంటలకు కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కవిత తీహార్ జైలులో తొలిరోజు మాత్రం కష్టంగానే గడిచిందని చెబుతున్నారు. కవిత బెయిల్ పిటీషన్ పై ఏప్రిల్ 1వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.


Tags:    

Similar News