Kalvakuntla Kavitha : కవిత కోపానికి అసలు కారణమదేనటగా?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని బాధపడుతున్నారని తెలిసింది

Update: 2025-05-19 12:31 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని బాధపడుతున్నారని తెలిసింది. దీంతో పాటు తనను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన బీజేపీతో బీఆర్ఎస్ సయోధ్యతగా నడుస్తుండటం కూడా కవిత కోపానికి కారణమని తెలిసింది. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కొన్ని నెలల పాటు తీహార్ జైలులో ఉండి వచ్చారు. బెయిల్ రావడం కూడా గగనమయింది. ఆరోగ్యం కూడా జైల్లో ఉన్న సమయంలో ఇబ్బందులు పెట్టింది. తనను అక్రమ కేసులో బీజేపీ నేతలు కావాలని ఇరికించారన్న కవిత లో అభిప్రాయం బలంగా ఉంది. తాను చేయని నేరానికి శిక్ష అనుభవించడమే కాకుండా జైల్లో ఉండటంతో పాటు తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్న బీజేపీని తాను క్షమించేది లేదని చెబుతున్నారు.

మెతక వైఖరిని సహించలేక...
బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కవిత ఇదే శపథాన్ని చేశారు. తాను బీజేపీ అంతం అయ్యే వరకూ పోరాడతానని నాడు జైలు బయట తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయాల ప్రయోజనాల కోసమే తనను జైలు పాలు చేసిందని, తన కుటుంబానికి కొన్ని నెలలపాటు దూరం చేసిందన్న ఆగ్రహం కమలం పార్టీపై కవితకు బాగా ఉంది. తనకు కాంగ్రెస్ కంటే ప్రధాన శత్రువు బీజేపీనే ఆమె చూస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కవిత సన్నిహితుల వద్ద కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారట. అలాంటి బీజేపీ పట్ల బీఆర్ఎస్ పార్టీ మెతక వైఖరిని అవలంబించడాన్ని కవిత సహించలేకపోతున్నారు.
బీజేపీని పన్నెత్తు మాట అనకుండా...
ఇటీవల పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు వరంగల్ జరిగినప్పుడు తన తండ్రి కేసీఆర్ కూడా కాంగ్రెస్ పై ఒంటికాలు మీద లేచారు కానీ బీజేపీపై విమర్శలకు పెద్దగా వెళ్లలేదు. ఈ అసంతృప్తి ఆమెలో అడుగడుగునా కనిపిస్తుందని చెబుతున్నారు. తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు, హరీశ్ రావు కూడా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తుతున్నారని, బీజేపీని పన్నెత్తు మాట అనకపోవడం తనను బాధిస్తుందని ఆమె చెబుతున్నారట. అందుకే ఇటీవల సామాజిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారని అంటున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఏమనుకున్నా తాను బీజేపీపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, బీజేపీకి బీసీల ఓటు బ్యాంకు దూరం చేసే లక్ష్యంతోనే కవిత ఆ రకమైన వ్యాఖ్యలు చేశారంటున్నారు. మరి కవిత కోపాన్ని పసిగట్టిన కారు పార్టీ అగ్రనేతలు ఇప్పటికైనా బీజేపీ ని కూడా శత్రువుగా చూస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.


Tags:    

Similar News