Padi Koushik Reddy : కౌశిక్ రెడ్డి కోరి వివాదాలను కొని తెచ్చుకుంటున్నాడా? అలాగయితేనే?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేరాఫ్ గా మారారు

Update: 2025-07-26 12:36 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాలకు కేరాఫ్ గా మారారు. ఆయన చేసే వ్యాఖ్యలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో తొలిసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా 2023 ఎన్నికల్లో పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారం నుంచి కాంట్రవర్సీతోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రచారంలోనూ తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని మరీ ఓటర్లను బెదిరించారని ఆయనపై ఆరోపణలు వినిపించాయి. అయితే ఆయన చివరకు గెలవడంతో ఆ వివాదంతోనే విజయం దక్కించుకున్నాడన్న ముద్ర కూడా పడింది. ఇక పాడి కౌశిక్ రెడ్డి గెలిచినప్పటికీ బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది.

రెండేళ్ల నుంచి దూకుడుగా...
గత రెండేళ్ల నుంచి మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంటే ఒకింత దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. సీనియర్ నేతలు సయితం ఒకింత సంయమనం పాటిస్తున్నాపాడి కౌశిక్ రెడ్డి మాత్రం అధినాయకత్వం మెప్పుకోసమో.. మరి వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కించుకోవడానికో తెలియదు కానీ ఒకింత స్పీడ్ గానే వ్యవహరిస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆయన చేసే విమర్శలు ప్రత్యర్థులకు సయితం వెగటు పుట్టించేలా కనిపిస్తున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన మరింత రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారని గులాబీ పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డుల్లో అంటున్నారంటే ఏ మేరకు ఆయన కామెంట్స్ ఉన్నాయన్నది అర్థమవుతుంది.
అనేక కేసులు...
అనేక సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పోలీసులపై దురుసుగా వ్యవహరించడంపై కూడా కేసులు నమోదయ్యాయి. తాజాగా పాడి కౌశిక్‌ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే విమర్శలు చేశారు. రేవంత్ ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్‌ చేయిస్తూ వారిని బ్లాక్‌మెయిల్‌ కు దిగారంటూ ఆరోపణలు చేశారు. అర్ధరాత్రి వేళ అక్కడకు ఎందుకు వెళుతున్నారని రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. రాజకీయ విమర్శలు వరకూ ఓకే.. కానీ ఏకంగా ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసేటప్పుడు కూడా పాడి కౌశిక్ రెడ్డి సంయమనం పాటించకపోవడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు. రేపో మాపో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు.
నివాసం వద్ద భారీ భద్రత...
అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఎన్.ఎస్.యూ.ఐ, కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటి ముట్టడికి పిలుపు నివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోవడం, అటు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరడంతో పోలీసులు అక్కడ భారీగా మొహరించారు. కౌశిక్ రెడ్డి కోరి వివాదాలను కొని తెచ్చుకుని బీఆర్ఎస్ లో తిరుగులేని లీడర్ గా ఎదగాలన్న ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంది.


Tags:    

Similar News