BRS : ఒకే దెబ్బకు రెండు... బీఆర్ఎస్ స్థానిక వ్యూహమిదే
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తాను చాటాలని యోచిస్తుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తాను చాటాలని యోచిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని తమను తెలంగాణలో ఎవరూ తుడిచిపెట్టడానికి ప్రయత్నించలేరన్న బలమైన సంకేతాలను ఇవ్వనుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తు లేకుండా జరుగుతాయి. అదే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుతోనే జరగనున్నాయి. దీంతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో పార్టీ పరపతి ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకోవడానికి కేటీఆర్ సిద్ధమయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఫలితాలపై ప్రభావం చూపలేవన్నది జనానికి తెలియజేయాలని భావిస్తున్నారు.
కవిత వ్యవహారంపైనా...
తన సోదరి కల్వకుంట్ల కవిత పార్టీ నేతలపై విమర్శలు చేయడంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కవిత ప్రభావం ఈ ఎన్నికల్లో ఉండకుండా ఉండేలా చూసుకోవాలని నేతలకు కేటీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతా తానే అయి లోకల్ ఎన్నికలను ఎదుర్కొనాలని నిర్ణయించారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ నేతలను సమన్వయం చేసుకుంటూ వెళతానని, పార్టీ కోసం గత రెండేళ్లుగా పార్టీ కోసం బాగా పనిచేస్తున్న వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలని నేతలను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత...
మరొకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా అవలంబిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ కు అనుకూలంగా మారేలా నేతలు వ్యవహరించాలని కేటీఆర్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే కొన్ని సీట్లు అత్యధికంగా గెలిచి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏంటో చెప్పాలని కేటీఆర్ నేతలకు సూచించారు. తాను జిల్లాల వారీగా పర్యటిస్తానని, మరికొన్ని జిల్లాల్లో హరీశ్ రావు కూడా పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన తీరుపై బాకీ కార్డును కేటీఆర్ విడుదల చేశారు. ఈ బాకీ కార్డు ప్రతి ఇంటికి చేరేలా చూడాలని కేటీఆర్ నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలతో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అటు కవితను దెబ్బతీసి పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందన్న విషయాన్ని తెలియజెప్పేలా వ్యవహరించాలని కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు