Harish Rao : హరీశన్నా..మీ మామకు నాడు చెప్పాల్సిందిగా?

బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా మాట్లాడుతున్నారు.

Update: 2025-02-27 06:57 GMT

బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా మాట్లాడుతున్నారు. ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులున్నాయి అన్నట్లు మాట్లాడుతున్నారు. గతంలో వాళ్ల మామ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా బయటకు రారు. ప్రగతి భవన్ ను దాటి బయటకు వచ్చే వారు కాదు. ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఎన్నో విపత్తులు సంభవించాయి. అయినా కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ దాటి బయటకు రాలేదు. అంతెందుకు ఆయన ప్రగతి భవన్ నుంచి సచివాలయానికి కూడా రావడం మానేశారు. నాలుగు వందల కోట్ల రూపాయలు పైగా వ్యయం చేసి నిర్మించిన సచివాలయంలో ఆయన ముఖ్యమంత్రిగా వచ్చింది అతి తక్కువ సార్లు మాత్రమే. జిల్లాల పర్యటనకు వెళ్లినా ఏదైనా పథకం ప్రారంభోత్సవానికి మాత్రమే వెళ్లేవారు.

పదేళ్ల కాలంలో...
కేసీఆర్ ఓటమికి అదీ ఒక కారణం. గత పదేళ్లలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అయినా ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడకూ కేసీఆర్ రాలేదు. ఆయన స్థానంలో మంత్రులు వెళ్లేవారు. అసలు అధికారులను, మంత్రులను సయితం కలిసేవారు కాదు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన పిలిస్తే ఎవరైనా వెళ్లాల్సిందే. పార్టీ నుంచి బయటకు రావడానికి ముందు ఈటల రాజేందర్ లాంటి వాళ్లు సయితం ఇదే రకమైన ఆరోపణలు చేశారు. మంత్రులను కూడా కలవకుండా కేసీఆర్ ప్రగతి భవన్ గేట్లు మూసేవారని ఆరోపించారు. అలాంటి కేసీఆర్ ఎక్కువ సమయం ప్రగతి భవన్ లేదా ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్ హౌస్ లోనూ గడిపేవారు. ఆయనతో సమస్యలపై మాట్లాడాలన్నా మంత్రులకే సాధ్యపడేది కాదు.
కేసీఆర్ ఏం చేశారో...
ఇప్పుడు హరీశ్ రావు చేసే ఆరోపణలు ఒకసారి వెనక్కు చూసుకుంటే అర్థమవుతుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదం జరిగి, ఎనిమది గల్లంతయితే ఇంతవరకూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లకపోవడమేంటని హరీశ్ రావు ప్రశ్నించారు. నిజానికి ఎస్.ఎల్.బి.సి టన్నెల వద్ద కొన్ని రోజులుగా మంత్రులు అక్కడే మకాం వేసి ఉన్నారు. ఉన్నతాధికారులున్నారు. ముఖ్యమంత్రి అక్కడకు వెళితే సహాయక చర్యలకు ఆటంకం తప్పించి ఇంకేమైనా ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ కు గత పదేళ్లలో జనంలో తిరగాలని హరీశ్ రావు అల్లుడిగా చెప్పి ఉంటే బాగుండేదన్న సెటైర్లు వినపడుతున్నాయి.


Tags:    

Similar News