కోటి ఎకరాలకు నీరు అందించి...
కరవు కాటకాల తెలంగాణకు నేడు కోటి ఎకరాలకు నీరందించానని కేసీఆర్ తెలిపారు. పదవుల కోసం ఆగం చేసిన వాళ్లు కాంగ్రెస్ నేతలు మాత్రమేనని అన్నారు. తెలంగాణను నాశనం చేసింది నాడైనా, ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. నాడు తెలంగాణ కోసం తాను పోరాడితే టీడీపీ, కాంగ్రెస్ నేతలు పెదవులు మూశారన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ప్రాణాలకు తెగించి తాను తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చానని కేసీఆర్ తెలిపారు. సకల జనుల సమ్మె, సాగర హారాలతో పోరాటం చేసిన తర్వాత కాని తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా పనిచేశామని కేసీఆర్ చెప్పారు. ఒకప్పుడు వెనకబడిన ప్రాంతమైన తెలంగాణను నెంబర్ వన్ లో నిలబెట్టింది బీఆర్ఎస్ కాదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. అనేక ప్రాజెక్టులను నిర్మించుకుని సాగునీరు అందించి మూడున్నర లక్షల టన్నుల వరిని పండించే స్థాయికి వచ్చామని కేసీఆర్ తెలిపారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల్లో పూడికలు తీసుకున్నామని తెలిపారు. పంజాబ్ ను తలదన్నేవిధంగా తెలంగాణను వ్యవసాయరంగంలో ముందుకు తీసుకెళ్లామని, రైతాంగాన్నిచంకలో పెట్టుకుని చూసుకున్నామని తెలిపారు.
ఇచ్చిన హామీలు అమలుచేయకుండా...
రైతు బంధు డబ్బులు సకాలంలో నాడు వేసేవారమన్నారు. రైతుల సంక్షేమం కోసమే తాము పనిచేశామని కేసీఆర్ చెప్పారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి అందరు రైతులను ఆదుకున్నామని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ కానీ అన్నివర్గాలకు అందచేశామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి హామీలు ఇవ్వకపోయినా అనేకం ప్రజలకు అందించామని కేసీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో ఏడు లక్షల మందికి ఉద్యోగాలు కొత్తగా వచ్చాయని చెప్పారు. తెలంగాణలో ముప్ఫయి మూడు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశామని కేసీఆర్ అన్నారు. ఇవన్నీ తాను చెప్పేవి కాదని, మీరే పదేళ్ల పాటు చూశారన్న కేసీఆర్ కాంగ్రెస్ వచ్చి ఏడాదిన్నర తర్వాత ఏం మాయరోగం వచ్చి? వీటిని అమలు చేయలేదని నిలదీశారు. గోల్ మాల్ తిప్పడంలో కాంగ్రెస్ ను మించినవాడు లేడన్నారు. ఉన్న గాంధీలు లేని గాంధీలు దిగి ప్రజలను మభ్యపెట్టారన్నారు. రైతుబంధు పదివేలు కేసీఆర్ ఇస్తే పదిహేను వేలు ఇస్తామని, నాలుగు వేల పింఛను ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎటు పోయిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని కేసీఆర్ సెటైర్ వేశారు. అధికారంలోకి వస్తే తులం బంగారం కూడా ఇస్తామని అన్నారని, ఇస్తున్నారా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఇంత ఆగం చేస్తారా?
పార్లమెంటు ఎన్నికల్లోనూ తెలంగాణలోనూ అందరి దేవుళ్లపై ప్రమాణం చేసి హామీలను అమలు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూముల ధరలు ఎలా ఉన్నాయని, ఇప్పుడు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. తన కళ్లముందే తెలంగాణ ఆగం అవుతుంటే కళ్లవెంట నీళ్లు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ పక్కకు పోయిన వెంటనే ఇంత ఆగమవుతదా? అని ప్రశ్నించారు. కరెంట్ ను ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ది కాదా? అని నిలదీశారు.కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కాంగ్రెస్ వాళ్లకు ఎందుకు ఇవ్వడం చేతకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనిని నెత్తిమీద పెట్టుకున్నట్లయిందన్నారు. మళ్లీ రైతాంగం దోపిడీకి గురవుతుందని, 2014 కు ముందు రోజులు వస్తున్నాయని, ఇది కాంగ్రెస్ అసమర్ధత కాదా? అని ప్రశ్నించారు. తాము బుల్ డోజర్లు పెట్టి చెరువు పూడికలు తీస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బుల్ డోజర్లు పెట్టి హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తుందని ఆవేదన చెందారు. ముందుకు పోవాల్సిన తెలంగాణ వెనక్కుపోతుందని, చాలా బాధ అవుతుందని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలు అయినా తాను నోరు విప్పింది ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనేనని కేసీఆర్ తెలిపారు. ఎవరైనా డబ్బుల కోసం యూనివర్సిటీ భూములను అమ్ముతారని ప్రశ్నించారు.