BJP : రాజా.. పాయల్.. ఇంకెవరు భయ్యా?
తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యేలు కట్టుతట్టుతప్పుతున్నట్లు కనిపిస్తుంది
తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యేలు కట్టుతట్టుతప్పుతున్నట్లు కనిపిస్తుంది. గతంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఆయన ఎమ్మెల్యే పదవిపై మాత్రం స్పీకర్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో రాజాసింగ్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. అదే సమయంలో ఆయన తన మాటలను వెనక్కు తీసుకోవడం లేదు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా కూడా రాజా సింగ్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కానీ ఆయన విషయంలో బీజేపీ ఏమీ చేయలేకపోతుందన్న వ్యవహారం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.
సీఎంపై ప్రశంసలు...
మరొకవైపు తాజాగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసించడం కూడా పార్టీలో చర్చనీయాంశమైంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి వెంట పాయల్ శంకర్ ఆసాంతం ఉన్నారు. ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి వెంట ఉండటం తప్పు కాదు. కానీ తర్వాత జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురిపించడమే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ ఉప్పు నిప్పుగా ఉంటాయి. అలాంటిది బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు కూడా ప్రశంసించని రీతిలో పొగడ్తలు కురిపించడంపై పార్టీ రాష్ట్ర నేతలు కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది.
జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు...
తన నియోజకవర్గానికి సంబంధించిన పనుల విషయంలో ముఖ్యమంత్రిని సభావేదికగా కోరవచ్చు. అంతే తప్ప బహిరంగ సభలో ముఖ్యమంత్రిపైనే సొంత పార్టీ నేతల కంటే ఎక్కువగా ప్రశంసించడం ఏంటన్న దానిపై ఇప్పటికే కొందరు నేతలు పాయల్ శంకర్ పై కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆయన మాట్లాడిన మాటలతో పాటు, పత్రికా క్లిప్పింగ్ లు కూడా జాతీయ నాయకత్వానికి పంపారని చెబుతున్నారు. పాయల్ శంకర్ మాత్రం ధీమాగా ఉన్నారు. రాజాసింగ్ నే ఏమీ చేయలేని పార్టీ నాయకత్వం తనను ఏమి చేస్తారన్న ధీమాలో పాయల్ శంకర్ ఉన్నట్లు కనపడుతుంది. మొత్తం మీద తెలంగాణీజేపీ ఎమ్మెల్యేలు కట్టుతప్పుతున్నారన్న కామెంట్స్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది.