Raja Singh : కేంద్ర నాయకత్వం చర్యలు తీసుకునే అవకాశం లేదా? సాగతీత కార్కక్రమమేనా?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం ఇంకా రాజీనామాను ఆమోదించలేదు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం ఇంకా రాజీనామాను ఆమోదించలేదు. రాజీనామా విషయంలోనిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం తీసుకునే అవకాశముందని తెలిసింది. దీంతో పాటు రాజాసింగ్ ను ఖచ్చితంగా పార్టీ కేంద్ర నాయకత్వం వదులుకోదన్న వాదన కూడా వినపడుతుంది. కరడు గట్టిన హిందుత్వవాదిగా తెలంగాణలో అందరూ ఓడిపోయినా ఒకే ఒక్కడు బీజేపీ నుంచి గెలిచి చరిత్ర సృష్టించార. మూడు సార్ల నుంచి గెలిచిన రాజాసింగ్ ను పార్టీ అంత సులువుగా వదులుకోదన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. రాజాసింగ్ పై గతంలో సస్పెన్షన్ విధించినా తర్వాత ఎత్తివేసి పార్టీలోకి తీసుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
ఆవేశంతో రాజీనామా చేశారని..
పార్టీ అధ్యక్ష పదవికి తనను నామినేషన్ వేయనివ్వలేదని ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం రాజాసింగ్ రాజీనామా లేఖను పార్టీ జాతీయ నాయకత్వానికి పంపింది. గోషామహల్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తనకు పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదని భావిస్తున్నారు. అందుకే ఆయన ఫ్రస్టేషన్ కు గురయి ఆవేశంగా రాజీనామా లేఖను సమర్పించి ఉండవచ్చని అంటున్నారు. కొంత సమయం ఇస్తే ఆయన కూడా సర్దుకుపోతారని భావించి నిర్ణయంలో కొంత సమయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఖచ్చితంగా గెలిచే సీటును...
ఖచ్చితంగా బీజేపీ ఖాతాలో పడే సీటు గోషామహల్. అక్కడ నుంచి గెలిచిన రాజాసింగ్ ను దూరం చేసుకుంటే మంచిది కాదని కేంద్ర నాయకత్వం కూడా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇటు రాజాసింగ్ కూడా రాజీనామా చేసిన రోజు కంటే తర్వాత కొంత దిగి వచ్చినట్లే కనపడుతుంది. పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకు నడచుకుంటానని ఆయన చెబుతున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తనకు పరవాలేదని, తాను రాష్ట్రంలో ఏ పార్టీలోకి వెళ్లనని, తనకు బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్ధాంతాలు పడవని చెబుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాలకు వెళ్లిపోతానని అంటున్నారు. అక్కడ శివసేనలో చేరే అవకాశాలున్నాయని అంటున్నా రాజాసింగ్ పై చర్యలు ఉండబోవన్నది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.