మంచిరేవులలో వెయ్యేళ్ల శిల్పాన్ని కాపాడుకోవాలి!

మంచిరేవుల్లో రాష్ట్రకూట వీరగల్లు పరిరక్షణపై ఆందోళన శిల్పంపై గీతలు, రంగు పూసిన దుర్వినియోగం

Update: 2026-03-22 13:56 GMT

హైదరాబాద్, మార్చి 22: నగర శివారులోని మంచిరేవుల గ్రామ సరిహద్దులో వెయ్యేళ్ల నాటి రాష్ట్రకూట కాలానికి చెందిన వీరగల్లు శిల్పం నిర్లక్ష్యానికి గురవుతోంది. దీనిని వెంటనే కాపాడాలని పురావస్తు పరిశోధకుడు డా. ఈమని శివనాగిరెడ్డి గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.

ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకు సమీపంలో బీరప్ప గుడి దగ్గర ఈ శిల్పం ఉంది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ ఇచ్చిన సమాచారంతో ఆదివారం డా. శివనాగిరెడ్డి అక్కడికి వెళ్లి పరిశీలించారు.

ఈ శిల్పంలో నిలబడి ఉన్న వీరుడు కుడి చేతిలో కత్తిని ఎత్తి పట్టుకుని, ఎడమ చేతిలో డాలు ధరించి కనిపిస్తున్నాడు. నడుముకు కట్టిన వస్త్రంతో పాటు చిన్న కత్తి, చేతులు, కాళ్లు, వంటిపై ఆభరణాలు స్పష్టంగా చెక్కబడ్డాయి. తలపై నాగపాము పడగలు ఉన్న తీరు కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇవన్నీ రాష్ట్రకూట కాలపు శిల్ప లక్షణాలకు నిదర్శనమని ఆయన చెప్పారు. ఈ ఆధారాలతో హైదరాబాద్ పరిసరాల చరిత్ర వెయ్యేళ్లకు పైబడుతుందని వివరించారు.

ఇటీవలి కాలంలో శిల్పంపై కొందరు గీతలు చెక్కి, ఎరుపు రంగు పూసినట్లు గుర్తించారు. ఆ రంగును తొలగించి అసలు రూపాన్ని కాపాడాలని ఆయన సూచించారు. ప్రస్తుతం శిల్పం ఎండలో ఎండుతూ, వానలో తడుస్తోందని, కనీస రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు.

స్థానిక వీరభద్ర ఆలయ పూజారులు పరమేశ్వర్, సిద్దేశ్వర్‌లను ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో యువ పురావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్ రెడ్డి, శిల్పి శివకృష్ణ, సాగర్ పాల్గొన్నారు.

Tags:    

Similar News