Bhadrachalam : గోదావరి పుష్కరాల సమయానికి వెలిగిపోనున్న రాములోరి ఆలయం

భద్రాచలం రామాలయానికి ఇక మహర్దశ పట్టనుంది.

Update: 2026-03-22 03:34 GMT

భద్రాచలం రామాలయానికి ఇక మహర్దశ పట్టనుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా అభివృద్ధి పనులు పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం చేపట్టాలని ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

భూ సేకరణకు...
ఈ సమావేశంలో ఇప్పటి వరకు పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి గారు పరిశీలించారు. అయోధ్య తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. భద్రాచలంలోని రాములోరు రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఆధ్మాత్మికతను సంతరించుకుంది. ఇక్కడే అనేక చారిత్రాత్మకమైన విషయాలు ఉండటంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనుల నిర్వహణ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
వచ్చే గోదావరి పుష్కరాల నాటికి...
వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి, అందుకు సంబంధించిన అంచనాలతో తొలి దశ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు జరగాలని చెప్పారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరగాలని సూచించారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు కూడా ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.


Tags:    

Similar News