Raja Singh : రాజాసింగ్ ఫ్యూచర్ ప్లాన్ ఇదేనా..? బీజేపీకి షాకింగేగా?

ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించింది. దీంతో ఆయన భవిష్యత్ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతుంది

Update: 2025-07-11 12:01 GMT

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను భారతీయ జనతా పార్టీ ఆమోదించింది. దీంతో రాజాసింగ్ భవిష్యత్ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతుంది. అయితే రాజాసింగ్ రాజీనామా చేసినప్పుడు ఆల్టర్నేటివ్ ప్లాన్ సిద్ధం చేసిపెట్టుకున్నట్లు సమాచారం. ఇటీవల బీజేపీ అధ్యక్ష పదవి కోసం రాజాసింగ్ తాను కూడా పోటీ చేసేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిప్పడు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారంటూ ఆయన పార్టీకి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా లేఖ సమర్పించారు. దీంతో పాటు పార్టీ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఎంపికపై కూడా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది.తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి ఇచ్చారు. రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది.

పదకొండేళ్ల క్రితమే చేరి...
అయితే రాజాసింగ్ పదకొండేళ్ల క్రితం బీజేపీలో చేరారు. వరసగా మూడు సార్లు రాజాసింగ్ కు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. దీంతో గోషామహల్ నుంచి మూడు సార్లు 2014, 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే వరస వివాదాలు ఆయన కొని తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆయనపై కేసులు నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంలోనూ, ఎంఐఎంపై విరుచుకుపడటంలోనూ బీజేపీ నేతల కంటే రాజాసింగ్ ముందుటారు. హిందుత్వం కోసమే తాను పనిచేస్తున్నట్లు రాజాసింగ్ చెబుతారు. అయితే మొన్న రాజీనామా చేసిన సమయంలోనూ తాను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరబోనని, తనకు, ఆ పార్టీ సిద్ధాంతాలు పడవని తెలిపారు.
పదవులు దక్కలేదని...
బీజేపీలో చేరినా ఆయనకు తనకు పదవుల విషయంలో అన్యాయం జరిగిందని భావించారు. శాసనసభపక్ష పదవి కూడా ఆయనకు దక్కలేదు. అందుకు కారణం ఆయన ఎవరి మాటవినరు. తాను తప్ప మరెవ్వరూ హిందుత్వం కోసం పనిచేయరన్న భావనతో ఆయన ఉంటారు. తనకు మించిన హిందుత్వ వాది మరొకరు ఉండరని తనకు తానే అనుకుంటారు. అందుకే బీజేపీలో ఉన్న నేతలను కూడా లెక్కచేయరు.శాసనసభ పక్ష నేతగా పదవి దక్కకపోవడానికి కూడా రాజాసింగ్ వ్యవహార శైలి కారణమని, బీజేపీలో 90 శాతం మంది రాజాసింగ్ ను వ్యతిరేకిస్తారు కాబట్టి ఇటు ఆపదవితో పాటు అటు పార్టీలోనూ మూడు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయినా ఎలాంటి పదవులు దక్కలేదు. ఇది వాస్తవం.
రాజకీయాలకు దూరంగా....
కానీ రాజాసింగ్ మాత్రం రాజకీయాల నుంచి దూరం జరిగే అవకాశం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన రాజీనామాను పార్టీ ఆమోదించడంతో ఇక తదుపరి ఎమ్మెల్యేపదవికి రాజీనామా చేస్తారంటున్నారు. ప్రస్తుతం రాజాసింగ్ అమర్ నాధ్ యాత్రలో ఉన్నారు. యాత్ర నుంచి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటున్నారు. అందుకు కారణం ఆయన శివసేనలో చేరతారంటున్నారు. శివసేనలో చేరి ఇక్కడ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికలో గెలిచి తన సత్తా ఏంటో గోషామహల్ లో చూపాలని రాజాసింగ్ సిద్ధమవుతున్నారని తెలిసింది. అందుకే ఆయన తన రాజీనామా ఆమోదించిందని తెలిసిన వెంటనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కలతో పగలనక, రాత్రనక పనిచేస్తున్న లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల బాధను తాను ఢిల్లీకి తెలియచేయలేకపోయినా, తాను హిందుత్వం కోసమే పనిచేస్తుంటానని, హిందూ సమాజ హక్కులకసం తన గొంతుక వినిపిస్తుంటానని ట్వీట్ చేయడం దీనికి బలం చేకూరుస్తుంది. అదేజరిగితే ఉపఎన్నికలు జరిగితే గోషా మహల్ లో బీజేపీకి కష్టకాలమేనని చెప్పాలి.


Tags:    

Similar News